19న తొలి మ్యాచ్‌తో ఐపీఎల్ లీగ్‌ ప్రారంభం   

19న తొలి మ్యాచ్‌తో ఐపీఎల్ లీగ్‌ ప్రారంభం   
క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) పూర్తి షెడ్యూల్‌ వచ్చేసింది. టోర్నీ ఆరంభానికి కనీసం 45 రోజుల ముందుగానే ఈ షెడ్యూల్‌ విడుదలయ్యేది.
 
ఈ సీజన్‌లో యుఎఇ ఆతిథ్య నగరాల్లో కోవిడ్‌ 19కి సంబంధించి వేర్వేరు నిబంధనలుండటంతో, ఆలస్యమైంది. అబుదాబి ఎమిరేట్‌లో కోవిడ్‌ 19 నిబంధనలు కఠినంగా ఉండగా.. దుబారు, షార్జా ఎమిరేట్స్‌లో సాధారణంగా ఉన్నాయి. తొలిదశ మ్యాచులు దుబారు వేదికగానే నిర్వహించాలనే ప్రతిపాదనపై సైతం చర్చ జరిగింది. 
 
మూడు వేదికలు (అబుదాబి, షార్జా, దుబాయ్‌)గా 46 రోజుల పాటు 56 మ్యాచ్‌లు జరుగనున్నాయి. టోర్నీ చరిత్రలో ఇన్ని రోజులు లీగ్‌ జరుగడం ఇదే తొలిసారి. మొత్తం మ్యాచ్‌ల్లో దుబాయ్‌లో 24, అబుదాబిలో 20, షార్జాలో 12 జరుగనున్నాయి. అయితే ఫ్లే ఆఫ్‌ మ్యాచ్‌లతో పాటు ఫైనల్‌ వేదికలను బీసీసీఐ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
గత నెల ఆఖరి వారంలోనే షెడ్యూల్‌ విడుదల కావాల్సి ఉన్నా..చెన్నై జట్టులో పాజిటివ్‌ కేసులతో పాటు క్వారంటైన్‌ రూల్స్‌ నిబంధనలు వేరుగా ఉండటం ఆలస్యానికి కారణమైంది.   పూర్తి షెడ్యూల్‌ను బోర్డు ఆదివారం విడుదల చేసింది.
మధ్యాహ్నం మ్యాచులు 3.30 గంటలకు, సాయంత్రం మ్యాచులు 7.30 గంటలకు ఆరంభం కానుండగా.. 53 రోజుల మెగా ఐపిఎల్‌లో పది రోజులు రెండేసి మ్యాచులు నిర్వహించనున్నారు. ఈ నెల 19న తొలి మ్యాచ్‌లో గత సీజన్‌ ఫైనలిస్ట్‌లు ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ అబుదాబిలో తలపడనున్నాయి.
 ఈ నెల 20న దుబారులో ఢిల్లీ క్యాపిటల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ అనంతరం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ తలపడనున్నాయి. ఈనెల 22న రాజస్థాన్‌ రాయల్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్‌ షార్జాలో పోటీపడనుంది. ప్లే ఆఫ్‌ మ్యాచుల వేదికను లీగ్‌ దశ అనంతరం తేల్చనున్నారు.