వచ్చే ఏడాది కూడా కరోనా వ్యాప్తి

కరోనా వ్యాప్తి 2021 సంవత్సరంలోనూ కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) డైరెక్టర్‌, భారత్‌ కొవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అభిప్రాయపడ్డారు. 
 
జన సంచారం పెరగడం, గ్రామాల దాకా వైరస్‌ పాకడం, కరోనా పరీక్షలను పెంచిన నేపథ్యంలో 2021 సంవత్సరంలోనూ కొన్ని నెలల పాటు కేసులు పెరుగుతూపోయే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ తర్వాత కేసులు పెరిగే వేగం క్రమంగా తగ్గుముఖం పట్టి.. ఒక నిర్దిష్ట రేటులో కొంతకాలం పాటు ఇన్ఫెక్షన్ల వ్యాప్తి కొనసాగొచ్చని అంచనా వేశారు. 
 
మొత్తం మీద వచ్చే ఏడాది తొలినాళ్లకల్లా కరోనా వ్యాప్తికి తెరపడొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా సామాజిక వ్యాప్తి రెండోదశకు చేరిందని తెలిపారు.  
 
ఇలా ఉండగా, గడచిన 24 గంటల వ్యవధిలో గతంలో ఎన్నడూ ఎంత భారీగా 90,633 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కరోనా కేసులతో కలిపి భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41 లక్షల మార్క్‌ను దాటింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 41,13,812 కాగా.. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 8,62,320.
 
కరోనా మరణాలు కూడా దేశంలో రోజుకు వెయ్యికి పైగానే నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. భారత్‌లో గడచిన 24 గంటల్లో 1,065 మంది కరోనా వల్ల మరణించారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 70,626కి చేరింది. భారత్‌లో ఇప్పటివరకూ 31,80,866 మంది కరోనా నుంచి కోలుకున్నారు.