రథం కాలిన ఘటనలో కుట్ర ?

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవాలయ రథం కాలిపోవడం దురదృష్టకరమని నరసారపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తెలిపారు. అంతర్వేది రథోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని, రథం కాలిపోయిన విధానం చూస్తే ఒక కుట్ర ప్రకారం జరిగినట్లు అనుమానాలు కలుగుతున్నాయని ఆయన ఆరోపించారు. 
 
ఒక మతం పై జరిగిన దాడిలా ప్రజలు భావించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని కోరారు. ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరిగిన ఒక పిచ్చివాడు చేశాడంటూ కేసులు కొట్టేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. 
 
ఈసారి అలా కాకుండా విచారణ జరిపించి బాధ్యులెవరైన, ఏ మతస్థులైన కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయేరోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 
మరోవంక, దేవస్థానంకు సంబంధించిన సీసీ కెమరాలు పనిచేయక పోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ ఈవోను సస్పెండ్ చేయాలని ఆగ్రామస్తులు, భక్తులు ఆందోళన చేపట్టారు.   
అంతర్వేది ఆలయం రథందగ్థంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఏపీలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పలు ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. గతంలో జరిగిన ఘటనలకు మతిస్థిమితం లేనివారి పనిగా చెప్పారని గుర్తుచేశారు. విచారణ జరిపి వాస్తవాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.