ఉపాధ్యాయులను పట్టించుకోని కేసీఆర్ 

ఎన్నికల వేళ టీచర్లకు అది చేస్తాం, ఇది చేస్తాం అని వరాలు గుప్పించే సీఎం కేసీఆర్ కరోనా కష్టకాలంలో వారిని పట్టించుకున్న పాపాన పోలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. జీతాలు రాక, చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీచర్లను, లెక్చరర్లను ఆదుకోవాలన్న సోయి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేకపోయిందని మండిపడ్డారు. 
 
ధనిక రాష్ట్రం అని ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయుల కోసం కనీస ప్యాకేజీ కూడా ప్రకటించలేదని దుయ్యబట్టారు. వైరస్ ను కట్టడి చేసేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో స్కూళ్లు, కాలేజీలు సహా విద్యాసంస్థలను బంద్ పెట్టాల్సి రావడంతో తరగతులు నడవడం లేదని ప్రైవేటు యాజమాన్యాలు టీచర్లు, లెక్చరర్లకు జీతాలు సగానికి పైగా కోత పెడుతున్నాయని తెలిపారు.
కొన్ని సంస్థలయితే అసలు మొత్తానికే జీతాలు ఇవ్వడం లేదని, దానితో చేతిలో చిల్లిగవ్వ లేక, రోజు గడవడమే గగనంగా మారి రాష్ట్రంలో ఉపాద్యాయులు, వారి కుటుంబీకులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావని ఆందోళన వ్యక్తం చేశారు అటు ప్రభుత్వ టీచర్ల పరిస్థితి విరుద్ధంగా ఏమీ లేదని చెప్పారు.
కరోనా పేరుతో జీతాలు కోత పెట్టిన కేసీఆర్ వారికిచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో 7వ పీఆర్సీ అమలు చేసేందుకు వాయిదాల మీద వాయిదాలు వేస్తుండడంతో ప్రభుత్వ టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు తమ  గౌరవానికి తగిన వేతనాలు పొందలేక తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు.
కనీసం మధ్యంతర భృతి కూడా చెల్లించడం లేదని, కరోనా పేరుతో జీతాలు కోత పెట్టిన ప్రభుత్వం ఇంతవరకు వాటిని చెల్లించలేదని ధ్వజమెత్తారు. అన్ లాక్ మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం 50 శాతం టీచర్ల హాజరీతో స్కూళ్లు నడిపించుకోవచ్చని అంటే తెలంగాణలో మాత్రం 100 శాతం టీచర్లు హాజరు కావాల్సిందే అంటూ నియంతృత్వ టీఆర్ఎస్ సర్కార్ బెదిరింపులకు పాల్పడుతోందని సంజయ్ విమర్శించారు
ఆన్ లైన్ క్లాసులకు టీచర్లకు సరైన శిక్షణ ఇవ్వకుండానే పాఠాలు చెప్పాల్సిందిగా బలవంతపెడుతున్నారని,  దీంతో టెక్నాలజీపై అంతగా పట్టులేని టీచర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. యాక్టివిటీ కార్డ్స్ అని, రిపోర్టులనీ కొత్త కొత్త పనులు చెప్తూ వారిపై పనిభారం మోపుతున్నారని చెప్పారు. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైమరీ స్కూల్ టీచర్ నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ల వరకు బోధన సిబ్బందిలో అనేక ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేయకపోవడంతో ఉన్న సిబ్బందిపైనే విపరీతమైన భారం నెడుతున్నారని సంజయ్ దుయ్యబట్టారు.