7 నుంచి హైద‌రాబాద్ మెట్రో రైలు  

హైద‌రాబాద్ మెట్రో రైలు స‌ర్వీసులు ఈ నెల 7వ తేదీ నుండి తిరిగి ప్రారంభం కానున్నాయి. ద‌శ‌ల‌వారీగా మెట్రో రైలు స‌ర్వీసుల‌ను అధికారులు ప్రారంభించ‌నున్నారు. రైళ్ల ఫ్రీక్వెన్సీ సుమారు 5 నిమిషాలు ఉంటుంది. ప్రయాణీకుల రద్దీ ఆధారంగా స‌ర్వీసుల‌ను పెంచ‌డం లేదా త‌గ్గించ‌డం జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలిపారు. 

కాగా కంటైన్మెంట్ జోన్లలోని స్టేషన్లు గాంధీ హాస్పిటల్, భ‌రత్ నగర్, మూసాపేట, ముషీరాబాద్, యూస‌ఫ్‌గూడ మూసే ఉంటాయ‌న్నారు. ప్ర‌యాణికులు భౌతిక‌దూరం పాటించేలా చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 

సీసీ టీవీ కెమెరాల ద్వారా ప‌ర్య‌వేక్షించ‌నున్న‌ట్లు చెప్పారు. ప్ర‌యాణికులు త‌ప్ప‌నిస‌రిగా ఫేస్ మాస్కులు ధ‌రించాల‌ని లేనియెడ‌ల జ‌రిమానాలు విధించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. క‌రోనా ల‌క్ష‌ణాలు లేని వ్య‌క్తుల‌ను మాత్ర‌మే ప్ర‌యాణానికి అనుమ‌తిస్తామ‌ని తెలిపారు. స్మార్ట్ కార్డు, క్యాష్ లెస్ విధానంలో టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ప్ర‌వేశ మార్గాల్లో పెడ‌ల్ శానిటైజ‌ర్ల‌ను అందుబాటులో ఉంచుతున్న‌ట్లు చెప్పారు. నాన్ రెవెన్యూ స‌మ‌యాల్లో స్టేష‌న్లన్నింటిని క్షుణ్ణంగా శానిటైజ్ చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు. అదేవిధంగా మెట్రో రైళ్ల‌ను డిపోలో శానిటైజ్ చేయ‌నున్న‌ట్లు చెప్పారు. లిఫ్ట్ బ‌ట‌న్స్‌, ఎస్క‌లేట‌ర్ హాండ్ రైల్స్‌, క‌స్ట‌మ‌ర హ్యాండ్లింగ్ పాయింట్ల‌ను ప్ర‌తీ నాలుగు గంట‌ల‌కు ఓసారి శానిటైజ్ చేస్తామ‌ని తెలిపారు. 

ర‌ద్దీని అనుస‌రించి మెట్రో తిరుగు ప్ర‌యాణంలో రైలు కోచ్‌ల‌ను కూడా శానిటైజ్ చేస్తామని వివరించారు. మరుగు దొడ్లను ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్ర‌ప‌రిచేందుకు ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపారు. మెట్రో ఉద్యోగుల‌కు, సెక్యూరిటీ సిబ్బందికి పీపీఈ కిట్లు, శానిటైజ‌ర్లు అంద‌జేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.