ఖాకీ యూనిఫాం చూసి గర్వపడాలి 

ప్రతి ఒక్కరు తమ ఉద్యోగాన్ని, వారి యూనిఫామ్‌ను చూసి గర్వపడాలి చెబుతూ ‘మీ ఖాకీ యూనిఫాం పట్ల గౌరవాన్ని కోల్పోకండి’ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) ప్రొబేషనర్స్  కు సూచించారు. 
 
హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శుక్రవారం జరిగిన ‘దీక్షాంత్ పరేడ్ ఈవెంట్’ లో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటూ కరోనా కారణంగా పోలీసులు చేస్తున్న మంచి పనులు వారు ఎప్పుడూ ప్రజల మనస్సులలో చిరస్మరణీయంగా మిగిలేలా చేశాయని కొనియాడారు.
 
‘మీ వృత్తిలో అకస్మాత్తుగా దేన్నయినా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అనేకసార్లు వస్తాయి. దీనికి మీరు సంసిద్ధులై అప్రమత్తంగా ఉండాలి. విపరీతమైన ఒత్తిడి కూడా ఉంటుంది. టీచర్ లాంటి ఎవరినైనా కలవండి. ఎవరి సూచనలకు మీరు గౌరవమిస్తారో వారిని మీట్ అవుతూ ఉండండి’ అని మోదీ సూచించారు. 
 
తమ యుక్త వయస్సులోనే ఉగ్రవాదం వంటి తప్పుడు దారి వైపు వెళ్లకుండా దేశ యువతను నియంత్రించాలని చెప్పారు. అకాడమీ నుంచి బయటకు వచ్చిన  యువ ఐపీఎస్ అధికారులతో తాను తరచూ సంభాషిస్తానని, అయితే ఈ సంవత్సరం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వారిని కలవలేకపోయానని ప్రధాని చెప్పారు.
 
 కానీ తన పదవీకాలంలో, ఖచ్చితంగా అందరినీ ఏదో ఒక సమయంలో కలుస్తానని తనకి ఖచ్చితంగా తెలుసు అని ఆయన తెలిపారు. నేష‌న‌ల్ పోలీస్ అకాడ‌మీలో 131మంది ఐపీఎస్‌లు శిక్ష‌ణ పొందారు. 
 
వీరిలో  28 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు. 42 వారాల పాటు శిక్ష‌ణ పూర్తిచేసుకున్న వీరిని ప‌లు కేడ‌ర్ల‌కు నియ‌మించారు. తెలంగాణ‌కు 11మంది, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఐదుగురు ఐపీఎస్‌లను కేటాయించారు.