సమగ్ర ప్రపంచ భద్రతకు భారత్ కట్టుబడి ఉంది

సమగ్ర,పారదర్శక ప్రపంచ భద్రతకు భారత దేశం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి  రాజ్‌నాథ్ సింగ్ షాంఘై సహకార సంఘం (ఎస్‌సీఓ) వేదికగా స్పష్టం చేశారు. 
 
షాంఘై సహకార సంఘం (ఎస్‌సీఓ), కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ (సీఎస్‌టీఓ), కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ (సీఐఎస్)  సభ్య దేశాల రక్షణ మంత్రుల సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం మాట్లాడుతూ, పారదర్శక, అన్ని దేశాల భాగస్వామ్యంతోకూడిన సమగ్ర, అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉండే ప్రపంచ భద్రతా వ్యవస్థ వృద్ధి చెందడానికి భారత దేశం కట్టుబడి ఉందని చెప్పారు. 

ఎస్‌సీఓ రీజియన్‌లో శాంతిభద్రతల కోసం అంతర్జాతీయ నియమ, నిబంధనలను గౌరవించే విశ్వసనీయ, సహకారాత్మక, విరోధం లేనటువంటి వాతావరణం అవసరమని పిలుపిచ్చారు. ఎస్‌సీఓ సభ్య దేశాల్లో ప్రపంచ జనాభాలో 40 శాతం పైగా ఉందని తెలిపారు. 

‘ఈ ప్రాంతంలో అందరి భద్రత, వృద్ధి మన లక్ష్యం కావాలి’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతంలో వేరే సందర్భంలో చెప్పారని గుర్తు చేశారు.  ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, అంతర్జాతీయ నేరాలు వంటివాటిని ఎదుర్కొనేందుకు సంస్థాగత సామర్థ్యం అవసరమని చెప్పారు.

అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని భారత దేశం నిర్ద్వంద్వంగా ఖండిస్తోందని, ఈ విషయం అందరికీ తెలుసునని చెప్పారు. ఎస్‌సీఓ రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్‌ కృషి చాలా విలువైనదని చెప్పారు. రాడికలిజం, అతివాదం వ్యాపించకుండా చేసిన కృషిని ప్రశంసించారు. రాజ్‌నాథ్ సింగ్ర మూడు రోజుల రష్యా పర్యటన ఈ నెల 3న ప్రారంభమైంది.