గణపతి లొంగుబాటు వెనుక కేసీఆర్ ప్రభుత్వం!

మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్‌ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగి పోతున్నట్లు మీడియాలో వస్తున్న కధనాలు కేసీఆర్ ప్రభుత్వ వ్యూహాత్మక ఎత్తుగడగా పలువురు భావిస్తున్నారు. మొత్తం 13 రాష్ట్రాలలో ఆయనపై భారీగా కేసులు ఉన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయనకోసం వేడెక్కుతున్నాయి. 
 
అందుకనే కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ప్రమేయం లేకుండా అయన లొంగుబాటు సాధ్యం అయ్యే అవకాశాలు లేవు. ఆయన లొంగిపోతే స్వాగతిస్తామని, ఎలాంటి ఇబ్బంది పెట్టబోమని తెలంగాణ పోలీసులు భరోసా ఇవ్వడం గమనిస్తే గణపతి వారికి అందుబాటులో ఉన్నారా లేదా ఆయన  ఆచూకీ తెలుసుకోవడం కోసం ఎత్తుగడ వేస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
చాలాకాలంగా గణపతి తెలంగాణకు దూరంగా ఉంటున్నారు. ఎక్కువగా ఛత్తీస్ ఘర్, ఝార్ఖండ్, ఒడిశా వంటి ప్రాంతాలలోనే గడుపుతున్నారు. అటువంటిది ఆయనను పట్టుకోవడం కోసం తెలంగాణ పోలీసులు ఇక్కడ ప్రయత్నించడం అంత నమ్మశక్యంగా లేదు.
`తెలంగాణ ఉద్యమం సందర్భంగా, ఎన్నికల ముందు తనది ` నక్సలైట్ల అజెండా’ అంటూ కేసీఆర్ ప్రకటించడం గమనార్హం. 2014 ఎన్నికలలో మావోయిస్టులు ఆయన గెలుపుకోసం కృషి చేశారు కూడా. మాజీ మావోయిస్టులు అనేకమంది టి ఆర్ ఎస్ లో కీలక పదవులలోకి  వచ్చారు. అధికారంలోకి వచ్చాక మావోయిస్టులతో సైద్ధాంతికంగా సంబంధాలు గల పలువురికి నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చారు.
గణపతి లొంగుబాటు గురించి వస్తున్న కథనాలను ఇప్పటికి మావోయిస్టు పార్టీ ఖండించక పోవడం గమనిస్తే తెలంగాణ ప్రభుత్వంకు ఆ పార్టీకి చెందిన వారితో సంబంధాలు ఉన్నాయా? ఇరువురు కలసి గణపతికి కాపాడటం కోసం చూస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలంగాణ పోలీసుల ముందు లొంగిన ఇతర రాష్ట్రాలలో ఉన్న కేసులు కూడా పరిష్కారం కావలసి ఉంది. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన కోసం జాతీయ దర్యాప్త సంస్థ(ఎన్‌.ఐ.ఏ), రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌(రా) వంటి జాతీయదర్యాప్తు సంస్థలు వెదుకుతున్నాయి.
గణపతి లొంగిపోవడానికి అంగీకరించినా ఒక్క తెలంగాణ పోలీసులు పాత కేసులు మాఫీ చేసినా మిగిలిన 12 రాష్ట్రాల పోలీసులు కేసుల ఎత్తివేతకు సుముఖంగా ఉంటారా? ఎన్,ఐ.ఏ, రా వంటి సంస్థల విచారించకుండా ఉంటాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ కేసులన్నీ ఎత్తేయాలంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అంగీకారం తెలపాల్సి ఉంటుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకు రావడం కోసం తెలంగాణ పోలీసులు గణపతి లొంగుబాటు కధనాల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కూడా పలువురు భావిస్తున్నారు.