గత ఏడాది ఉధృతంగా 55 రోజుల పాటు సమ్మె జరిపిన ఆర్టీసీ కార్మికులను ప్రగతి భవన్ కు పిలిచి, వారికి భోజనం పెట్టి, వారితో రోజంతా గడిపి వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ సీఎం కేసీఆర్ భారీ హామీలు గుప్పించారు. కానీ సంవత్సరం దాటుతున్నా వారి గురించి పట్టించుకోవడం లేదు.
‘ఆర్టీసీ ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ఢోకా లేదు. డ్రైవర్లు, కండక్టర్ల సస్పెన్షన్ ఉండదు. వారం రోజుల్లో గైడ్‌లైన్స్ తయారు చేయండి’ అంటూ కేసీఆర్ గంభీరంగా చెప్పుకొచ్చారు. సమ్మె తర్వాత అనేక మందిని సస్పెండ్ చేశారు. మరికొందరిని డిపో స్పేర్‌లో పెట్టారు.
వీరందరినీ తిరిగి డ్యూటీలోకి తీసుకోవడంలేదు. జీతాలు కూడా ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. సమ్మె సందర్భంగా 200 మంది, అంతకు ముందు మరో 100 మంది ఉద్యోగులు ఈ విధమైన ఊగిసలాటలో గడుపుతున్నారు. వీరి గురించి ఎవ్వరు పట్టించుకోవడం లేదు.
కేసీఆర్ ఆదేశంతో వారందరిని తిరిగి పనిలోకి తీసుకోవడం కోసం అధికారులు గైడ్‌లైన్స్ రూపొందించారు. వీటిపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కూడా పలు దఫాలుగా సమావేశమయ్యారు. పలు మార్పులు చేయాలని సూచించారు. కానీ ఆ తర్వాత అవి పత్తా లేకుండా పోయాయి.
సాధారణంగా సస్పెండ్ అయిన మూడు లేదా నాలుగు నెలల్లో విచారణ పూర్తి చేసి మళ్లీ డ్యూటీలోకి తీసుకుంటారు. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు కొందర్ని బదిలీ చేస్తారు. కానీ ఏడాది అవుతున్నా.. ఇప్పటికీ ఎలాంటి చర్య తీసుకోలేదు. డిపో స్పేర్ పెట్టిన వాళ్లకు కూడా డ్యూటీ ఇస్తలేరు. జీతం కూడా చెల్లిస్తలేరు. అధికారులు మాత్రం ఉద్యోగ భద్రత గైడ్‌లైన్స్ వస్తేనే అన్ని సరిచేస్తామని చెబుతున్నారు.
More Stories
ముందు చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించండి రేవంత్
బంజారా మ్యూజియం ప్రారంభించిన ప్రధానికి కృతజ్ఞతలు
హైదరాబాద్ నుండి నేరుగా గోవాకు రైలు ప్రారంభం