కళ తప్పిన గణేష్‌ నిమజ్జన శోభాయాత్ర 

కరోనా మహమ్మారి కారణంగా గణేష్‌ నిమజ్జన శోభాయాత్ర కళ తప్పింది. ట్యాంక్‌బండ్‌ రోడ్లపై సందడి పెద్దగా కనిపించలేదు. డిజె సౌండ్లు, డప్పుల దరువు, యువత నృత్యాలు, చిన్నారుల కేరింతలు, కళాజాతాలు లేకుండానే గణేష్‌ నిమజ్జనం నిరాడంబరంగా సాగింది. 

అపార్టుమెంట్లు, గణేష్‌ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండపాలకు మాత్రమే పోలీసులు షరతులతో కూడిన అనుమతులివ్వడంతో ట్యాంకుబండ్‌పై కోలాహలం కనిపించలేదు. హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో నిమజ్జనానికి ప్రభుత్వం 21 క్రేన్లను ఏర్పాటుచేసింది. ఈసారి నగరవాసులు భారీ గణనాధులను ప్రతిష్టించలేదు. 

నిమజ్జనం సందర్భంగా ట్యాంకుబండ్‌తో పాటు శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసి కంట్రోలింగ్‌ యూనిట్‌ నుంచి నిత్యం పరిస్థితిని సమీక్షించారు. పెద్దగా భక్తులు గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజలు కూడా పోలీసులకు సంపూర్ణ సహకారం అందించారు.

మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన నిమజ్జన కార్యక్రమం బుధవారం ఉదయం వరకు కొనసాగింది.  గణేష్‌ ఉత్సవాలంటే గుర్తుకు వచ్చే ఖైరతాబాద్‌, బాలాపూర్‌ గణపయ్యల శోభాయాత్ర సాదాసీదాగా జరిగింది. మధ్యాహ్నం సమయానికే ఖైరతాబాద్‌ గణేషుడు గంగమ్మ ఒడిలోకి చేరుకున్నారు. ఈసారి ఖైరతాబాద్‌ గణనాథుడు కేవలం 9 అడుగుల మట్టి విగ్రహంగా భక్తులకు దర్శనమిచ్చారు.

కరోనా నేపథ్యంలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. చార్మినార్‌ పరిసరాల్లో సైతం ఖాళీగా కనిపించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మీడియాకు కూడా ఆంక్షలు విధించారు. కిలోమీటర్‌ దూరం వరకు ఎవరినీ అనుమతించలేదు. ఎన్‌టిఆర్‌మార్గ్‌, ట్యాంక్‌బండ్‌పై 21 క్రేన్లు ఏర్పాటు చేశారు.

పోలీసులు 15 వేల మంది బందోబస్తులో ఉన్నారు. చాంద్రాయణగుట్ట నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు 15 నుంచి 18 కిలోమీటర్ల శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగింది. ఈ ఏడాది 50 వేలకు పైగా విగ్రహాలు ప్రతిష్టించగా, సోమవారం నాటికి నగరంలో 30 వేలకు పైగా విగ్రహాల నిమజ్జనం పూర్తి అయింది. మంగళవారం ఒక్కరోజే మూడు వేలకుపైగా విగ్రహాలు నిమజ్జనానికి తరలివచ్చాయి.

బుధవారం ఉదయం 9 గంటల వరకు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. గణేష్‌ ఉత్సావాల సందర్భంగా ప్రతి ఏడాదీ అందరి దృష్టి బాలాపూర్‌ లడ్డుపైనే ఉంటుంది. ఈసారి బాలాపూర్‌లో వేలం పాట లేకుండానే గణేష్‌ శోభయాత్ర ప్రారంభమైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బాలాపూర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ లడ్డు వేలం ప్రక్రియను రద్దు చేసింది.

1994లో మొదలైన లడ్డు వేలంలో కొలను మోహన్‌రెడ్డి రూ.450కు సొంతం చేసుకోగా, గతేడాది (2019లో) కొలను రాంరెడ్డి రూ.17.60 లక్షల రికార్డు ధరకు లడ్డును సొంతం చేసుకోవడం తెలిసిందే.