జగన్ సాగునీటి పథకాలకు అప్పిచ్చేవారే లేరా!

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకొనడమే కాకుండా, ఆర్ధిక వ్యవహారాల నిర్వహణ సహితం అస్తవ్యస్తంగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ లకు అప్పులు ఇవ్వాలంటే బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు మొహం చాటేస్తున్నాయి. 
 
ముఖ్యంగా ప్రతిష్టాకరంగా చేపట్టిన సాగునీటి పథకాలకు నిధులు అందుబాటులోకి రావడం లేదు.  వార్షిక బడ్జెట్ లో కేవలం రూ 13, 096 కోట్లు మాత్రమే కేటాయించినా ఈ సంవత్సరం సుమారు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో పెండింగ్ ప్రాజెక్ట్ లతో పాటు పలు కొత్త ప్రాజెక్ట్ లు చేపట్టడానికి జగన్ పధకం వేశారు.
అయితే అవసరమైన నిధులను అప్పులుగా తెచ్చుకోమని ఆ భారం సాగునీటి శాఖపై వదిలివేశారు.  ఈ విషయంలో ఆర్ధిక సంస్థల నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో కాంట్రాక్టర్లే నేరుగా బ్యాంకులు ఆర్ధిక సంస్థల కేంద్ర కార్యాలయాలకు వెళ్ళి ప్రభుత్వంకు అప్పులు ఇవ్వమని తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఫలితం ఉండడం లేదు.
 

 రాష్ట్రంలో ఏడాదిలోగా ప్రాజెక్టులను ప్రారంభించేందుకు నిర్మాణాలు జోరుగా చేపట్టాలంటే.. రూ.1,078 కోట్లను తక్షణమే విడుదల చేయాల్సి ఉంది. అదేవిధంగా ప్రాధాన్య ప్రాజెక్టులకు రూ.15,433 కోట్లు అవసరం. 

ద్వితీయ ప్రాధాన్య ప్రాజెక్టులకు రూ.1,105 కోట్లు, తర్వాతి ప్రాధాన్య ప్రాజెక్టుకు రూ.4,157 కోట్లు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు రూ.3,778 కోట్లు కావాలి. వెరసి రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఇప్పటికే రూ.24,443 కోట్లకు అంచనాలు ఉన్నాయి.

ఇవే కాకుండా ప్రభుత్వం  కొత్తగా మరికొన్ని ప్రాజెక్టులకు కార్యాచరణను సిద్ధం చేసింది.వాటిలో రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం అత్యంత కీలకమైనది. ఈ పథకానికి రూ.39,980 కోట్లు ఖర్చవుతాయని అంచనా.

మరోవంక, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ.8,400 కోట్లు, రాష్ట్ర జల భద్రతా పథకానికి రూ.12,702 కోట్లు, పల్నాడు దుర్భిక్ష నివారణ పథకానికి రూ.7,633 కోట్లు, కృష్ణా కొల్లేరు నీటి శుద్ధి పథకానికి రూ.3,356 కోట్లు.. వెరసి రూ.72,071 కోట్లు ఖర్చుచేయాలి.

 

వీటికితోడు ఇటీవల కడపలో పలు రిజర్వాయర్ల నిర్మాణం.. కాలువల అభివృద్ధి పనుల కోసం రూ.8,000 కోట్ల వరకూ అంచనాలతో ప్రభుత్వం పాలనానుమతులు మంజూరు చేసింది. రాజధాని నగరానికి నీరందించేందుకు చేపట్టే వేదాద్రి ప్రాజెక్టుకు రూ.500 కోట్ల వరకూ ఖర్చవుతాయి.