కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రారంభం వాయిదా  

ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజయవాడ కనకదుర్గ  ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవం వాయిదా పడింది. తొలుత ఈనెల 4న కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కలసి ఈ వంతెనను ప్రారంభించాల్సి ఉంది.
అయితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సోమవారం మరణించడంతో కేంద్ర ప్రభుత్వం వారం రోజులపాటు, రాష్ట్ర ప్రభుత్వం ఐదు రోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తోంది. దీంతో ఈ ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. రూ.502 కోట్ల వ్యయంతో ఈ వంతెనను నిర్మించారు.
 
మరోవైపు ఈ నెల నాలుగో తేదీనే మరికొన్ని రోడ్లు, వంతెనలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగాల్సి ఉంది.  ఇప్పటికే పూర్తయిన నగరంలోని బెంజి సర్కిల్‌ ఫ్లై ఓవర్‌‌ లాంఛన ప్రారంభోత్సవం కూడా వాయిదా పడింది. ఫిబ్రవరిలోనే ఈ వంతెనపై వాహనాల రాకపోకలకు అధికారులు అనుమతించారు. 
 
అలాగే రూ.100 కోట్లతో నిర్మించ తలపెట్టిన బెంజి సర్కిల్‌ రెండో  ఫ్లై ఓవర్‌‌కు శంకుస్థాపన, రూ.740 కోట్లతో నిర్మించిన మచిలీపట్నం రోడ్డు ప్రారంభోత్సవం, రూ.2,700 కోట్లతో నిర్మించనున్న విజయవాడ బైపాస్‌ రోడ్ల రెండు ప్యాకేజీలకు శంకుస్థాపనలు చేయాల్సి ఉంది. ఈనెల 8వ తేదీ తర్వాత ఈ ఫ్లై ఓవర్‌‌ ప్రారంభించే అవకాశం ఉంది.