కమ్యూనిస్ట్ లకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన ప్రణబ్ 

కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన వారిలో ప్రణబ్ ముఖర్జీ ముందువరసలో ఉంటారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఘనంగా నివాళులు అర్పించారు. కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో శ్రీ ప్రణబ్ చిత్రపటానికి పూలమాలలు శ్రద్ధాంజలి ఘటిస్తూ 
కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ జాతీయభావాలున్న వ్యక్తిగా వర్ణించారు. 
 
ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ సమావేశానికి హాజరైన ఏకైక కాంగ్రెస్ నేత అని పేర్కొంటూ నరేంద్ర మోదీ ప్రభుత్వం  ప్రణబ్ ముఖర్జీ ను భారతరత్నతో సత్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. వారి మృతితో దేశంలో ప్రతి కుటుంబం ఒక ఆత్మీయుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. 
 
ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అత్యున్నతమైన పార్లమెంట్ విలువలను పాటిస్తూ సంక్షోభ సమయాల్లో దేశానికి దిశెనిర్ధేశం చేసిన ఉత్తమ పార్లమెంటేరియన్ ప్రణబ్ ముఖర్జీ దేశ ఆర్ధిక మంత్రిగా అనేక సంస్కరణలు చేపట్టి దేశాన్ని వృద్ధి బాట పట్టించారని గుర్తు చేశారు. 
 
ఏ పదవిలో పనిచేసిన తన పనితీరుతో, చాతుర్యతతో ఆ పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి  అంటూ రాజకీయాలకు అతీతంగా దేశం కోసం అందరితో కలిసి పనిచేసిన గొప్ప రాజనీతజ్ఞుడు అని తెలిపారు. అటువంటి వారు రాజకీయాల్లో చురుగ్గా పనిచేయాలనుకుంటున్న నేటి యువతకు గొప్ప స్ఫూర్తి అని చెప్పారు.
 
దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లు పై భారత రాష్ట్రపతిగా వారు సంతకం పెట్టడం తెలంగాణ ప్రజలు మర్చిపోరని సంజయ్ పేర్కొన్నారు. 
 
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ను ఒప్పించి, రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోచించి తెలంగాణ ప్రజల మనుసును గెలుచుకున్న గొప్ప నాయకుడు ముఖర్జీ అని తెలిపారు.
 
కాగా,మాజీ రాష్ట్రపతి  ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి శాసనమండలి పక్ష నాయకులు ఎన్. రామచందర్ రావు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి,  దుగ్యాల ప్రదీప్ కుమార్, కుమారి బంగారు శృతి, బిజెపి రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి డాక్టర్ ఉమా శంకర్  పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
 
 అనంతరం సంతాప సూచకంగా బీజేపీ జెండాను సగం వరకు దించారు. ఈ సందర్భంగా రామచంద్ర రావు మాట్లాడుతూ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. గొప్ప రాజకీయవేత్త. రెండు పర్యాయాలు ప్రధానమంత్రి అవకాశం వచ్చి చేజారిన వ్యక్తి అని పేర్కొన్నారు.