ఎమ్మెల్సీ ఎన్నికల్లో  పోటీకి కేసీఆర్ వెనుకంజ!

వచ్చే ఏడాది మొదట్లో పట్టభద్రుల నియోజకవర్గాల నుండి రెండు స్థానాలకు జరిగే శాసన మండలి ఎన్నికలలో  టీఆర్ఎస్ అధికారికంగా అభ్యర్థులను నిలబెట్టే విషయమై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తున్నది. ఎన్నికలలో పోటీ చేసి ఓటమి చెందడం అధికార పక్షానికి అప్రదిష్ట కాగలదని భయపడుతున్నట్లు చెబుతున్నారు. 

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ రామచందర్ రావు పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో ముగుస్తోంది. ఈ రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు పార్టీలు సిద్దమవుతున్నాయి. ఓటర్ల నమోదు ప్రక్రియను కూడా ప్రారంభించాయి. 

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2 నెలల తర్వాత  జరిగిన కరీంనగర్, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ లో ఆ పార్టీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి విజయం సాధించారు. దీంతో పట్టభద్రుల నియోజకవర్గాలలో పోటీ  చేసేందుకు టీఆర్ఎస్  దైర్యం చేయలేకపోతున్నది. 

ఎన్నికల్లో పోటీ చేయకుండా తటస్థులకు మద్దతిస్తే ఎలా ఉంటుందనే కోణంలో కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్టు  టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచందర్ రావు, వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం నుంచి టీజేఎస్ తరపున కోదండరాం పోటీ చేయనున్నారు. 

దీంతో హైదరాబాద్ లో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర రావుకు మద్దతిస్తే ఎలా ఉంటుందని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికలలో ఇక్కడ ఎన్జీఓ నేత స్వామి గౌడ్ ను నిలబెట్టి బిజెపి అభ్యర్థి చేతిలో ఓటమి చెందవలసి వచ్చింది. వరంగల్ లో కోదండరాంపై బలమైన తటస్థ అభ్యర్థి ఎవరనే దానిపై అన్వేషణ జరుపుతున్నారు.