అమర జవాన్లుగా అమరులైన వైద్యులు 

Patna: Doctors busy collecting samples of suspected Coronavirus victims at the isolation ward at the Patna Medical College and Hospital, on March 14, 2020. (Photo: IANS)

కోవిడ్ మహమ్మారి కారణంగా మరణించిన వైద్యులందరినీ సాయుధ దళాల అమరవీరులతో సమానంగా పరిగణించి వారి కుటుంబంలో ఒకరికి వారి విద్యార్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీకి భారతీయ వైద్య సంఘం(ఐఎంఎ) విజ్ఞప్తి చేసింది. కొవిడ్-19 మహమ్మారితో పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వైద్యులందరికీ వర్తించే విధంగా ఒకే విధానంతో పరిహారం ప్రకటించి వారి కుటుంబాలకు న్యాయం చేయాలని ఐఎంఎ ప్రధానికి రాసిన ఒక లేఖలో కోరింది.

ఇప్పటి వరకు దేశంలో మొత్తం 87,000 మంది ఆరోగ్య సిబ్బంది కొవిడ్-19 బారిన పడగా వీరిలో 573 మంది మృత్యువాత పడ్డారని ప్రభుత్వ గణాంకాలను ఉటంకిస్తూ ఐఎంఎ పేర్కొంది. ఈ వివరాలు దేశవ్యాప్తంగా వైద్యరంగంలో ఆందోళన కలుగచేస్తున్నాయని, మృతులలో 307 మంది డాక్టర్లు ఉండడం మరింత ఆందోళనకరమని ఐఎంఎ తెలిపింది.

డాక్టర్లలో 2,006 మందికి కరోనా వైరస్ సోకిందని, మరణించిన డాక్టర్లలో 188 మంది జనరల్ ప్రాక్టీషనర్లని పేర్కొంది. డాక్టర్లకు వైరల్ లోడ్ అధికంగా ఉంటుందని, అంతేకాక వారిలో కేస్ ఫటాలిటీ రేట్ కూడా ఎక్కువని ఐఎంఎ తెలిపింది.

మహమ్మారి సందర్భంగా డాక్టర్లు సువీయ రక్షణ కోసం ఇళ్లలోనే ఉండిపోవచ్చని, కాని వైద్య వృత్తి ధర్మాన్ని అనుసరించి దేశ ప్రజలను కాపాడేందుకు వారు ముందుండి పోరాడుతున్నారని ఐఎంఎ తన లేఖలో పేర్కొంది. 

ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం తరహాలోనే అమరులైన డాక్టర్ల కుటుంబాలకు కూడా వర్తింపచేయడం న్యాయమని ఐఎంఎ అభిప్రాయపడింది. ప్రస్తుతం అమలులో ఉన్న పరిహార విధానానికి కాలం చెల్లిపోయిందని, అర్హులకు ఎటువంటి ప్రయోజనం లభించడం లేదని కూడా ఐఎంఎ తెలిపింది.