
ఎంఐఎం పార్టీ చేతిలో సీఎం కీలుబొమ్మలా మారారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ‘రాష్ట్ర ప్రభుత్వానికి పాతబస్తీలో మొహర్రం ర్యాలీ కనిపించలేదా? కేసీఆర్ సెక్యులరిజం ఇదేనా?’ అని ప్రశ్నించారు. డబిర్ పురలో మొహర్రం ర్యాలీని ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేదని నిలదీశారు. పాతబస్తీలో మొహర్రం ర్యాలీ సీఎం ఆదేశాల మేరకే జరిగిందని ఆరోపించారు.
మొహర్రంపై కాంగ్రెస్, -కమ్యూనిస్టు పార్టీలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ర్యాలీ నిర్వహించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా మైనార్టీలు రోడ్లపై తిరగడం వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయని ధ్వజమెత్తారు.
‘హిందూ సమాజాన్ని కేసీఆర్ బొందుగాళ్లను చేశారు. ఆయన నిజమైన హిందుత్వం ఏంటో బయటపడింది’ అని సంజయ్ దయ్యబట్టారు. సీఎం వల్ల హిందూ సమాజం ఇబ్బంది పడుతోందని అంటూ అభిమానం, భక్తి, సెంటిమెంట్ను కాదని గణేశ్ మండపాలు పెట్టుకోకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు.
ధైర్యంగా మండపాలు ఏర్పాటు చేసిన వాళ్లపై పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. కరోనాను అడ్డుపెట్టుకొని బోనాలు,- ఉగాది,- శ్రీరామ నవమి, గణేశ్ పండుగ చేసుకోనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సమాజానికి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎంఐఎం కొమ్ము కాస్తోందని సంజయ్ విమర్శించారు. హోం మంత్రిపై ఎంఐఎం దాడి చేస్తే కనీసం ఖండించే ధైర్యం టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు రానున్న రోజుల్లో హిందువుల ఓట్లు అవసరం లేదా అని ప్రశ్నించారు.
More Stories
సైబర్ నేరగాళ్ల చేతిలో 16.80 కోట్ల మంది పర్సనల్ డేటా
సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణ 27న!
హైదరాబాద్ లో రెచ్చిపోతున్న వీధి కుక్కలు