జనవరి 1నుంచి ఏపీలో సమగ్ర భూ సర్వే

సమగ్ర భూ సర్వే 2021 జనవరి 1 నుంచి చేపట్టి 2023 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సమగ్ర భూ సర్వే వివాదాల పరిష్కారానికి మొబైల్‌ ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేసి అక్కడికక్కడే వివాదాల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. 
 
సర్వే గురించి గ్రామ సభల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర భూ సర్వే ఫైలెట్‌ ప్రాజెక్ట్‌పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తూ సమగ్ర భూ సర్వే కోసం డ్రోన్లు, రోవర్లు, సర్వే రాళ్లు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 
 
కంటిన్యూయస్‌ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్స్‌( కోర్స్‌) టెక్నాలజీపై సర్వేయర్లకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. అన్ని మండలాల్లో ఒకేసారి సమగ్ర భూ సర్వే ప్రారంభించాలని. అర్భన్‌ ప్రాంతాల్లో కూడా సర్వే చేయాలని ఆదేశించారు. 
 
ఇందు కోసం ఏర్పాటు చేసుకున్న టీమ్‌ సభ్యులను పెంచుకోవాలని చెప్పారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని సిఎంకు అధికారులు వివరించారు. 
 
రెవెన్యూ కోర్టులో 52,866 వివాదాలు ఉండగా వెబ్‌ల్యాండ్‌ పొరపాట్లకు సంబందించిన 79,405 వివాదాల పరిష్కారానికి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు అధికారులు సిఎంకు తెలిపారు. ఫైలెట్‌ ప్రాజెక్ట్‌కు సంబందించిన వివరాలను అధికారులు ప్రజంటేషన్‌ రూపంలో ముఖ్యమంత్రికి వివరించారు. 
 
మొదటి విడతగా భూముల రీ- సర్వే కోసం జూన్‌లో మొదటి దశలో ఫైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో రీ సర్వే అధికారులు చేపట్టిన విషయాన్ని అధికారులు సిఎంకు తెలిపారు. గతంలో కమతాలు 182 కాగా నేడు 631 కమతాలు ఉన్నాయని చెప్పారు. 
వాస్తవానికి కమతాల సంఖ్య కన్నా సర్వే నెంబర్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. 631 కమతాలకు 829 సర్వే నెంబర్లు ఉన్నాయని వెల్లడించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమగ్ర భూ సర్వే చేస్తున్న తొలి రాష్ట్రం మనదేనని అధికారులు పేర్కొన్నారు.  ఈ ఆర్దిక సంవత్సరంలో బడ్జెట్‌లో పెట్టిన రూ.200.15 కోట్లకు పరిపాలనామోదం ఇవ్వాలని సర్వే సెటిల్‌మెంట్‌ డైరెక్టర్‌ అప్పట్లో ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు సంబంధించిన పరికరాల కొనుగోలుకు అనుమతి కోరారు. 
 
ఈ సర్వే ఫేజ్‌-1, ఫేజ్‌-2 కోసం 65 బేస్‌స్టేషన్లు, కంట్రోల్‌ సెంటర్ల స్దాయి పెంపు, నిర్వహణ కోసం నిధులు విడుదల చేయాలని 11,158 రోవర్స్‌ కొనుగోలుకు పరిపాలనామోదం ఇవ్వాలని సర్వే డైరెక్టర్‌ ప్రభుత్వాన్ని కోరారు. తిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం గతంలోనే అనుమతించింది. సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో, కొలతల్లో ఏ మాత్రం లోపం లేని విధంగా రీ సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.