మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని ఆర్మీ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం చనిపోయారు. ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. 
వైద్యుల ప్రయత్నాలు, ప్రజల ప్రార్థనలు ఫలించలేదని, తన తండ్రి కొద్దిసేపటి కిందటే చనిపోయిన సంగతి పేర్కొనడం చాలా బాధగా ఉందన్నారు. 84 ఏండ్ల ప్రణబ్ ముఖర్జీకి ఇటీవల కరోనా సోకడంతో ఆర్మీ దవాఖానలో చేరారు. 
 
ఈ సందర్భంగా మెదడులో రక్తం గడ్డకట్టంపై వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్ష‌న్ కార‌ణంగా ఆయన కోమాలో ఉన్నారని గత కొన్ని రోజులుగా వైద్యులు తెలిపారు. వెంటిలేట‌ర్ స‌పోర్టుతో  ఉన్న ప్రణబ్ ఆరోగ్యం మరింత విషమించినట్లు సోమవారం ఉదయం ఆందోళన వ్యక్తం చేశారు.  

ప్రణబ్ ముఖర్జీ ఆగస్ట్ 10న ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు మెదడుకు సంబంధించిన అత్యవసర శస్త్రచికిత్స అనంతరం ప్రణబ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. కొద్దిరోజుల నుంచి ఆయన కోమాలోనే ఉన్నారు.

రాష్ట్రపతిగా, కేంద్రమంత్రిగా, కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతగా ప్రణబ్‌ భారత రాజకీయాల్లో తనదైన గుర్తింపు పొందారు. ప్రణబ్ ముఖర్జీ 1935 డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్బూమ్ జిల్లాలో ఉన్న మిరాఠి గ్రామంలో జన్మించారు. ఎంఏ(చరిత్ర), ఎంఏ(రాజనీతిశాస్త్రం), ఎల్‌ఎల్‌బీ, డీ.లిట్ (విద్యాసాగర్ కాలేజీ) వంటి విద్యార్హతలు సంపాదించారు. చదువు పూర్తయిన అనంతరం కొంతకాలం టీచర్, జర్నలిస్టుగా పనిచేశారు.

 గ‌త ఏడాది భార‌త ర‌త్న పుర‌స్కారాన్ని గెలుచుకున్న మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ రాజ‌కీయ ప్ర‌స్థానం 1969లో ప్రారంభమైంది. మిడ్నాపూర్ ఉప ఎన్నిక‌ల వేళ‌ వీకే కృష్ణ‌మీన‌న్ త‌ర‌పున ప్ర‌ణ‌బ్ ప్ర‌చారం నిర్వ‌హించారు.  ఆ స‌మ‌యంలో ఇందిరా గాంధీ ప్ర‌ధానిగా ఉన్నారు.  ప్ర‌ణ‌బ్ ట్యాలెంట్‌ను గుర్తించిన ఇందిర ఆయ‌న్ను పార్టీలోకి ఆహ్వానించింది. 

1969లో రాజ్య‌స‌భ‌కు ప్ర‌ణ‌బ్ తొలిసారి ఎన్నిక‌య్యారు. ఆ త‌ర్వాత 1975, 1981, 1993, 1999 ఎన్నిక‌ల్లోనూ ప్ర‌ణ‌బ్ రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. 2019లో ప్ర‌ణ‌బ్‌కు భార‌త ర‌త్న అవార్డు ద‌క్కింది.

ఆయన మృతిపట్ల కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అనేక దశాబ్దాలపాటు భారత దేశానికి విశేష సేవలందించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిరాడంబరత, నిజాయితీలకు ప్రతిరూపమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.