భారత రత్న ప్రణబ్ ముఖర్జీని కోల్పోయిన భారత్ దు:ఖిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మాజీ రాష్ట్రపతి మరణం పట్ల తన సంతాపాన్ని తెలిపారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో ప్రణబ్ ముఖర్జీ చెరగని ముద్ర వేశారనిమోదీ కొనియాడారు.
పండితుడితో సమాన శ్రేష్ఠమైన ప్రణబ్ ముఖర్జీ అత్యున్నత రాజనీతిజ్ఞుడని ప్రశంసించారు. రాజకీయాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాలకు ఆయన ఆరాధనీయుడయ్యారని మోదీ తెలిపారు. ప్రణబ్ ముఖర్జీతో తన అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
2014లో ప్రధానిగా ఢిల్లీకి కొత్తగా వచ్చిన తనకు నాటి రాష్ట్రపతి అయిన ప్రణబ్ ముఖర్జీ తొలి రోజు నుంచి మార్గదర్శకత్వంగా నిలిచి అన్నింటా మద్దతిచ్చి ఆశీర్వాదించాలని మోదీ చెప్పారు. ఆయనతో అనుబంధాన్ని తాను ఎల్లప్పుడూ ఆదరిస్తానని అన్నారు. ప్రణబ్ కుటుంబ సభ్యులకు మోదీ సంతాపం తెలిపారు.
కాగా, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాప దినాలుగా పాటించాలని నిర్ణయించింది. ప్రణబ్ అందించిన సేవల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రణబ్ కు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రణబ్ మృతితో రాష్ట్రపతి భవన్, ఇతర కార్యాలయాలపై ఉన్న జాతీయ పతాకాలను అవనతం చేశారు.
మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆర్మీ ఆస్పత్రిలో చేరిన ప్రణబ్ ముఖర్జీకి కొద్ది రోజుల క్రితం శస్త్రచికిత్స జరిపారు డాక్టర్లు. అయినా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోగా…మరింత విషమించింది.దీనికి తోడు కరోనా సోకడంతో ప్రణబ్ కోలుకోలేక పోయారు. ఆర్మీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ ఇవాళ(సోమవారం) తుది శ్వాస విడిచారు.
More Stories
మిత్రుడు ట్రంప్ కు ప్రధాని మోదీ అభినందనలు
ప్రత్యేక హోదా పునరుద్దరించాలని కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం
అన్ని ప్రైవేట్ ఆస్తుల స్వాధీనం కుదరదు