కర్ణాటక, మహారాష్ట్ర మధ్య ఆర్వో-ఆర్వో రైలు

కర్ణాటక, మహారాష్ట్ర మధ్య రోల్-ఆన్ / రోల్-ఆఫ్ (ఆర్‌ఓ-ఆర్‌ఓ) సరుకు రవాణా ప్రత్యేక రైలుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  బీఎస్ యెడియూరప్ప వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చజెండా ఊపి ఆదివారం ప్రారంభించారు. 

లోడ్ లారీలతో కూడిన ఈ గూడ్స్ రైలు బెంగళూరులోని నెలమంగళ నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్‌కు బయలుదేరింది. ధర్మవరం, గుంతకల్, రాయ్‌చూర్, వాడీ మీదుగా సోలార్‌పూర్‌లోని బాలేకు చేరుతుంది. 682 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 17 గంటల్లో ప్రయాణిస్తుంది. 

రోల్ ఆన్ – రోల్ ఆఫ్ రైలు వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తు దారులకు ఎంతో ఉపయోగపడుతుందని, కర్ణాటక-మహారాష్ట్ర మధ్య సరకు రవాణాను సునాయం చేస్తుందని సీఎం యెడియూరప్ప తెలిపారు.

రైల్వే సహాయ మంత్రి సురేష్ అంగడి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి రోజు బెంగళూరు నుంచి సోలాపూర్‌కు సుమారు ఏడు వేల లారీలు ప్రయాణిస్తాయని  చెప్పారు. అవి అక్కడకు చేరేందుకు 36 నుంచి 38 గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు. 

ఈ నేపథ్యంలో లోడ్ లారీలను గూడ్స్ రైలు ద్వారా చేరవేయడంపై ఏప్రిల్ నెలలో ప్రయోగాత్మకంగా ఒక రైలు నడిపినట్లు చెప్పారు. అది విజయవంతం కావడంతో రోల్ ఆన్ – రోల్ ఆఫ్ రెగ్యులర్ గూడ్సు రైలును ప్రారంభించినట్లు సురేష్ తెలిపారు. దీనివల్ల కేవలం 17 గంటల్లోనే సరుకు లారీలు గమ్యస్థానాలకు చేరుతాయని, ఇంధనం ఆదా కావడంతోపాటు రహదారులు, పర్యావరణానికి ఈ విధానం ఎంతో మేలని వివరించారు.