దేశ ఆర్థిక పురోగతికి దన్నుగా వ్యవసాయం    

దేశ ఆర్థిక పురోగతికి గ్రామీణ డిమాండ్‌ దన్నుగా నిలువగలదని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ తాజా నివేదికలో పేర్కొన్నది. అయితే పట్టణ డిమాండ్‌కు ఇది ప్రత్యామ్నాయం మాత్రం కాలేదని స్పష్టం చేసింది.

పారిశ్రామిక, సేవా రంగాలు ఇంకా కరోనా ప్రభావం నుంచి బయటపడలేదన్న ఇండియా రేటింగ్స్‌ గాడి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి దారిలోకి తెచ్చేందుకు వ్యవసాయ రంగమే చోదక శక్తి అవుతుందన్నది. లాక్‌డౌన్‌తో పారిశ్రామిక కార్యకలాపాలు స్తంభించడం, దుకాణాలు, హోటల్స్‌, సినిమా హాల్స్‌ మూతపడటం వంటివి నగరవాసుల కొనుగోళ్ల శక్తిని తీవ్రంగా ప్రభావితం చేసిన విషయం తెలిసిందే.

ఉద్యోగాల్లేక, జీతాలు రాక, ఉపాధి కరువై అంతా ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. దీంతో వ్యవసాయ ఆధారిత గ్రామీణ ప్రాంతాల్లోనే డిమాండ్‌ కనిపించింది. జూన్‌లో మోటర్‌సైకిల్‌, ట్రాక్టర్ల అమ్మకాల్లో నమోదైన వృద్ధిరేటే ఇందుకు నిదర్శనం. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటం కూడా వ్యవసాయంపై మరిన్ని ఆశల్ని రేకెత్తిస్తున్నాయి.

ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో దేశ జీడీపీ మైనస్‌ 17.03 శాతంగా నమోదు కావచ్చని ఇండియా రేటింగ్స్‌ అంచనా వేసింది. సోమవారం క్యూ1 జీడీపీ గణాంకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనున్నది. మరోవైపు కరెంట్‌ ఖాతా లోటు కూడా క్యూ1లో రికార్డు స్థాయిలో దాదాపు 18 బిలియన్‌ డాలర్ల మిగులుగా ఉండొచ్చన్నది.