పేదరిక నిర్మూలనకు గట్టి పునాది జనధన్  

జనధన్ యోజన దేశంలో పరివర్తనను తీసుకువచ్చిందని, పేదరిక నిర్మూలనకు గట్టి పునాది వేసిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. పేదలకు బ్యాంక్ ఖాతాల ఏర్పాటుకు సంబంధించిన ఈ పథకం ఆరవ వార్షికోత్సవం నేపథ్యంలో ఇది గేమ్‌ఛేంజర్ స్కీమ్ అని ప్రధాని స్పష్టం చేశారు. 
 
దేశంలో పలు పేదరిక నిర్మూలనా కార్యక్రమాలను దళారీల బెడద లేకుండా, చిత్తశుద్థితో నిర్వహించడంలో జనధన్ యోజన కీలక మైలురాయిగా మారిందని ఆయన పేర్కొన్నారు. 2014లో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాని మోడీ చేపట్టిన పలు ప్రధాన పథకాలలో ఈ జనధన్ యోజన ఒకటి. 
 
దీని ప్రాతిపదికన దేశంలో కోట్లాది మంది నిరుపేదల పేరిట బ్యాంక్ ఖాతాలను ఎటువంటి డిపాజిట్లు లేకుండా ప్రారంభించారు. ప్రభుత్వ పథకాల లబ్థిదారులందరికీ ఈ స్కీమ్ పరిధిలోని ఖాతాల్లోకి డబ్బు చేరే ఏర్పాటు చేశారు. ఇది అత్యంత ప్రతిష్టాత్మక పథకం అని, ఇప్పటివరకూ బ్యాంక్ ఖాతాలు లేని వారికి బ్యాంకింగ్ వ్యవస్థ అనుసంధాన ప్రక్రియగా ఇది దారితీసిందని తెలిపారు.
ఇది కేవలం ఇతర పథకాల వంటిది కాదని, ఓ మౌలిక మార్పును తీసుకువచ్చిన పథకంగా మారిందని ప్రధాని తెలిపారు. దేశంలో సరైన రీతిలో పక్కదారులు పోకుండా పేదరిక నిర్మూలనా పథకాలు చేపట్టేందుకు ఈ పథకం ఓ అత్యుత్తమ వేదికగా మారిందని తెలిపారు. పలు కోట్ల కుటుంబాల భవిత భద్రతకు ఈ యోజన దోహదం చేసిందని, తాను ఈ పథకానికి మనసారా ధన్యవాదాలు తెలియచేసుకోవల్సి ఉంటుందని చెప్పారు.

ఈ పథకం పరిధిలో అత్యధిక శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు, ప్రత్యేకించి మహిళలు లబ్ధిదారులు అయ్యారని విశ్లేషించారు. ఆరేళ్లు గడిచిన ఈ పథకాన్ని ఎప్పటికప్పుడు తమ అకుంఠిత దీక్షతో విజయవంతం చేస్తున్న వారందరిని తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఈ జనధన్ యోజన ప్రగతిని తెలిపే గ్రాఫ్‌ను ట్వీట్‌లో జత చేశారు. 

ఇప్పటివరకూ 40 కోట్ల బ్యాంక్ ఖాతాలను ఈ స్కీం పరిధిలో ఆరంభించారు. వీరిలో 63 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. ఇక 55 శాతం మంది మహిళా లబ్ధిదారులు ఉన్నారని, ఇప్పుడు తాను జతచేస్తున్న గ్రాఫ్‌లతో ఈ విషయం స్పష్టం అయిందని తెలిపారు.