తెలంగాణ జలవిద్యుత్ ప్రాజెక్ట్ ల భద్రతపై దర్యాప్తు 

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జల విద్యుత్  ప్రాజెక్టులను ఆడిట్ చేసి భద్రతా లోపాలపై విచారణ జరిపిస్తామని  కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రిని కలిసి శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్ట్ ప్రమాదంపై వివరించగా, రాష్ట్రం లోని జలవిద్యుత్ ప్రోజెక్టుల లోపాలపై విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. 
 
ప్రమాద ఘటన పై తీవ్రంగా స్పందించిన ఆర్కే సింగ్.కేంద్ర విద్యుత్ సంస్థ (సిఈఏ) ద్వారా విచారణ జరిపిస్తామని తెలిపారు. సంస్థ భవిష్యత్తు కోసం ఇంజనీర్లు ప్రాణాలు కోల్పోవడం పట్ల  కేంద్ర మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 
 
గత ఆగస్ట్ 20న శ్రీశైలం జలవిద్యుత్కేంద్రంలో జరిగిన ప్రమాదానికి రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని, ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సీఐడీ విచారణ కంటితుడుపు చర్య తప్ప మరొకటి కాదని సంజయ్ కుమార్ కేంద్ర మంత్రికి వివరించారు.
 
రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యుత్ పంపిణీ సంస్థ ట్రాన్స్ కో విద్యుదుత్పత్తి సంస్థ జెన్ కోకు బకాయిలు చెల్లించలేకపోయిందని, ఫలితంగా నిధుల కొరతను ఎదుర్కొంటున్న జెన్ కో సరైనా భద్రతా చర్యలను చేపట్టలేకపోయిందని ఫిర్యాదు చేశారు.
 
నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ కోడ్ నెంబర్ 850 ప్రమాణాల మేరకు శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు లేవు. 1998, 2009 వరదలు, 2019 అగ్రిప్రమాదం అనంతరమూ జల విద్యుత్కేంద్రంలో భద్రతా ప్రమాణాలనుపెంచలేదని సంజయ్ విమర్శించారు.
 
ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే అందులో పనిచేసే ఉద్యోగులను అలర్ట్ చేసేందుకు ఎలాంటి ఫైర్ అలారం లేదని, నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ప్రమాణాల మేరకు అన్ని జలవిద్యుత్కేంద్రాల్లో ఫైర్ అలారం ఏర్పాటు చేయాలేదని తెలిపారు. అక్కడ హీట్, ఫ్లేమ్, స్మోక్ డిటెక్టర్స్ లేవు. ప్రమాదం సంభవించే అవకాశాలను అంచనా కట్టడం లేదని, ఎప్పటికప్పుడు భద్రతా చర్యలను సమీక్షించలేదని వివరించారు.
అనుకోకుండా వరదలు, అగ్నిప్రమాదం లాంటివి సంభవిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఉద్యోగులకు తగిన శిక్షణ ఇవ్వలేదని తెలిపారు. ఫైర్ ఎక్స్ టింగిషర్స్ కూడా చాలినంత మేరకు లేవని అంటూ అత్యసవర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్నదానిపై ఉద్యోగులకు శిక్షణ ఇప్పించాలని సూచించారు.
 
ప్రమాదాలు ఎదురైనప్పుడు తప్పించుకునేందుకు ఎమర్జెన్సీ లైటింగ్ గాని, సరైన వెంటిలేషన్ గాని లేదని సంజయ్ తెలిపారు. ప్రమాదం సంభవించినప్పుడు చీకట్లు కమ్ముకొని పూర్తిగా అంధకారం కావడంతో ఉద్యోగులు ప్రత్యామ్నాయ మార్గాల నుంచి తప్పించుకోలేకపోయారని గుర్తించారు. ఫలితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని కేంద్ర మంత్రికి వివరించారు.