అమెరికా యుద్ధ నౌకల లక్ష్యంగా చైనా క్షిపణులు

చైనా, అమెరికా మధ్య యుద్ధమేఘాలు ఆవరిస్తున్నాయి. అమెరికా యుద్ధ నౌకల లక్ష్యంగా చైనా బుధవారం నాలుగు క్షిపణులు ప్రయోగించింది. దక్షిణ చైనా సముద్రంలో చైనా నిర్వహిస్తున్న సైనిక విన్యాస్లాల్లో భాగంగా వియత్నం సమీపంలో ఉన్న రెండు అమెరికా విమాన వాహక యుద్ధ నౌకలు, అమెరికా సైనిక కేంద్రాల దిశగా వీటిని ప్రయోగించింది.
అయితే అవి తమ లక్ష్యాలకు కొంత దూరంలో సముద్రంలో పడిపోయాయి. అమెరికా విమాన వాహక యుద్ధ నౌకలు దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తే వాటిని క్షిపణులతో పేల్చివేస్తామని చైనా ఈ మేరకు హెచ్చరించింది. చైనా ప్రయోగించిన క్షిపణుల్లో అత్యంత శక్తివంతమైన, వ్యూహాత్మ ఆయుధాలైన డీఎఫ్-21డీ, డీఎఫ్-26డీ ఉన్నట్లు ఆ దేశ పైనిక వర్గాలు తెలిపాయి.
 కాగా, చైనా సైనిక విన్యాసాల్లో భాగంగా నాలుగు మధ్యంతర శ్రేణి ఖండాతర క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికా సైనిక అధికారి ఒకరు వెల్లడించారు. అయితే అవి దక్షిణ చైనా సముద్రంలోని హైనాన్ ద్వీపం, వియత్నాం సమీపంలో వివాదాస్పద పారాసెల్ గొలుసు ప్రాంతంలోని అమెరికా విమాన వాహక యుద్ధ నౌకలు ఉన్న సమీపంలో పడినట్లు తెలిపారు.
వివాదస్పద దక్షిణ చైనా సముద్రంలో చైనా సైనిక విన్యాసాలు నిర్వహించడం ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెంచేందుకేనని పెంటాగాన్ ఆరోపించింది. చైనా క్షిపణుల ప్రయోగం వల్ల ఈ ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని హెచ్చరించింది.
మరోవైపు తమ సైనిక విన్యాసాలు ఏ దేశాన్ని ఉద్దేశించి కాదని చైనా గురువారం పేర్కొంది. అమెరికా రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా భయపడబోమని చైనా రక్షణ ప్రతినిధి సీనియర్ కర్నల్ వు కియాన్ తెలిపారు. తమ గగనతలంలోకి అమెరికా నిఘా విమానాలు ఎగురడాన్ని ఆయన ఖండించారు.
కాగా దక్షిణ చైనా సముద్రంలో చైనా చేపడుతున్న సైనిక విన్యాసాలపై అమెరికా స్పై విమానాలు నిఘా పెట్టాయి. బధవారం కూడా వరుసగా రెండోసారి చైనా గగనతలం మీదుగా అమెరికా గూఢచార విమానాలు ఎగిరాయి.
మంగళవారం దక్షిణ చైనా సముద్రంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ విన్యాసాలు చేస్తున్న వైపుగా యూఎస్ యూ-2 చాలా ఎత్తులో ఎగిరింది. బుధవారం కూడా మరో నిఘా విమానం యూఎస్ ఆర్సీ-135ఎస్ దక్షిణ చైనా సముద్రంలోనే మరోచోట జరుగుతున్న చైనా విన్యాసాలను రహస్యంగా ఫోటోలు తీసింది.
మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో చైనా ఏక కాలంలో మూడు చోట్ల సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నది. దీంతో తైవాన్, జపాన్, అమెరికా నుంచి ఎలాంటి ముప్పు వాటిల్లినా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నదని రక్షణ రంగ నిఫుణులు అంచనా వేస్తున్నారు.