ఇలాగైతే కాంగ్రెస్‌ మరో 50 ఏళ్లు ప్రతిపక్షంలోనే

ఇలాగైతే కాంగ్రెస్‌ మరో 50 ఏళ్లు ప్రతిపక్షంలోనే

అంతర్గత విభేదాలతో వీధిన పడిన కాంగ్రెస్ లో మార్పులు జరుగవలసిందే అంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ మరోసారి తిరుగుబాటు స్వరం వినిపించారు. కాంగ్రెస్‌ పార్టీలో సంస్కరణలు, సంస్థాగత ఎన్నికలు జరగాల్సిందేనని డిమాండ్ చేశారు.

పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగకుంటే మరో 50 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. అనేక ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో ఎన్నికైన కమిటీలే లేవని గుర్తు చేశారు.  ఎన్నికల ద్వారానే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిని నియమించాలని స్పష్టం చేశారు.

ఎన్నికలు లేకుండా అధ్యక్షుడిని నియమిస్తే అతనికి పార్టీలో ఒక్కశాతం మంది నుంచి కూడా మద్దతు ఉండదని చెప్పారు. దీనివల్ల ఎవరైనా ఆ పదవిలో దీర్ఘకాలం కొనసాగలేకపోవచ్చని, ఇది అంతర్గతంగా ఎప్పుడూ సమస్యే అవుతుందని వారించారు. అలాకాకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఏ సమస్యా ఉండదని, అధ్యక్ష పదవి నుంచి ఎవరూ తొలగించలేరని చెప్పారు.   

అంతేకాకుండా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సహా రాష్ట్ర, జిల్లా, బూత్‌స్థాయి అధ్యక్షుల వరకు అన్ని కీలక పదవులకూ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఎన్నికల ద్వారా ఏర్పాటైన నాయకత్వంలో పార్టీ బాగుంటుందని హితవు చెప్పా రు. పార్టీ బాగుకోసమే తామంతా సోనియా గాంధీకి లేఖ రాసినట్లు స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామనుకునే వారే తన విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. 
 
పార్టీలో కేవలం ఇద్దరు లేదా ముగ్గురి మధ్యే పోటీ ఉంటుందని, వారిలో 51 శాతం ఓట్లు వచ్చిన వ్యక్తి ఎన్నికవుతాడని, అప్పుడు అతని వెంట 51 శాతం మంది ప్రజలు ఉన్నట్టేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.