ఎగుమతుల్లో తెలంగాణ భేష్ 

నీతిఆయోగ్‌ ప్రకటించిన ఎగుమతుల సన్నద్ధత సూచీలో (ఈపీఐ-2020) తెలంగాణ మెరుగైన స్థానాన్ని సాధించింది. భూ పరివేష్ఠిత రాష్ట్రాల (అన్ని వైపులా భూ సరిహద్దులే ఉన్న రాష్ట్రాల) ఎగుమతుల్లో దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది. అంతేగాక దేశం నుంచి దాదాపు 70 శాతం ఎగుమతులను నమోదు చేస్తున్న టాప్‌ 5 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉన్నది. 
 
ఈ జాబితాలో ఉన్న ఏకైక భూ పరివేష్ఠిత రాష్ట్రం తెలంగాణనే కావడం విశేషం. మిగతా నాలుగు తీరప్రాంతాలున్న రాష్ట్రాలు. మొత్తంగా చూస్తే ఎగుమతుల సన్నద్ధతలో తెలంగాణ దేశంలో 6వ స్థానంలో నిలిచింది. గుజరాత్‌ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. 
 
తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాలు  తీరప్రాంతాలను కలిగి ఉన్నవేనని తెలిసిందే. ఇక భూపరివేష్ఠిత రాష్ట్రాల్లో తొలిస్థానంలో రాజస్థాన్‌లో, రెండోస్థానంలో తెలంగాణ నిలిచాయి. 
 
నీతిఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌ ఈపీఐ-2020ను విడుదల చేస్తూ  రాబోయే రోజుల్లో భారత ఎగుమతులను రెట్టింపు చేస్తామని ప్రకటించారు. ఎగుమతులను ప్రోత్సహించడానికి రాష్ట్రాలు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని సూచించారు. 
 
ఎగుమతులు వేగంగా పెరిగితే అది దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు దోహదం చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఏప్రిల్‌లో ఎగుమతులు 60 శాతం తగ్గిపోయాయని తెలిపారు. భారత తలసరి ఎగుమతుల వాటా 241 డాలర్లు. ఇది దక్షిణ కొరియాలో 11,900 డాలర్లు. చైనాలో 18,000 డాలర్లుగా ఉన్నది.
నీతిఆయోగ్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాంపిటీటివ్‌నెస్‌ సంయుక్తంగా మొట్టమొదటిసారి ఈ ఇండెక్స్‌ను విడుదల చేశాయి. ఎగుమతుల్లో సవాళ్లు, అవకాశాలను గుర్తించి ఎగుమతుల వృద్ధికి కార్యాచరణను రూపొందించడానికి ఈ ఇండెక్స్‌ను రూపొందించాలని నిర్ణయించారు. మొత్తం 32 అంశాల ఆధారంగా దీనిని తయారు చేశారు.