పుల్వామా సూత్రధారి మసూద్‌…. ఎన్‌ఐఏ స్పష్టం  

పుల్వామా దాడి కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చార్జిషీట్‌ దాఖలు చేసింది. జైషే మహ్మద్‌ చీఫ్‌, పాకిస్థాన్‌కి చెందిన ఉగ్రవాది మౌలానా మసూద్‌ అజర్‌ ఈ ఘోర కలికి ప్రధాన సూత్రధారి అని పేర్కొంది. మసూద్‌తో పాటు ఆయన ఇద్దరు సోదరులు రౌఫ్‌ అజ్గర్‌, మౌలానా మహ్మద్‌ అమర్‌ పేర్లను కూడా చార్జిషీట్‌లో చేర్చింది. 
 
ఈ మేరకు 13 వేల పేజీలతో కూడిన చార్జిషీట్‌ను జమ్ములోని ప్రత్యేక కోర్టుకు మంగళవారం సమర్పించింది. దాడికి పాల్పడిన కీలక కుట్రదారుగా మసూద్‌ అజర్‌ మేనల్లుడు మహ్మద్‌ ఉమర్‌ ఫరూఖ్‌ను పేర్కొంది. 1999లో భారత విమానాన్ని హైజాక్‌ చేసిన ఇబ్రహీం అజార్‌ కుమారుడే ఈ ఫరూఖ్‌. 
 
వీళ్లతో పాటు మరో 19 మంది ఉగ్రవాదులను నిందితులుగా ఎన్‌ఐఏ చేర్చింది. 2019, ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై పుల్వామాలో జైషే ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సైనికులు అమరులయ్యారు.  

తొలుత ఎటువంటి ఆధారాలు లేకుండా ఉన్న ఈ కేసును ఎన్‌ఐఎ అత్యంత ప్రతిష్టాత్మకంగా సవాలుగా తీసుకుని దర్యాప్తు చేపట్టింది. పలు రకాలుగా సాగించిన దర్యాప్తు క్రమంలో అక్కడ లభించిన ఎలక్ట్రానిక్ పరికరాల సాక్షాలు, చిక్కిన కొందరు ఉగ్రవాదులు, ఆ ప్రాంతంలోని ఉగ్రవాదుల సానుభూతిపరుల స్టేట్‌మెంట్లను ప్రాతిపదికగా చేసుకుని కేసును చాకచక్యంగా ఛేదించింది.

పలు వేర్వేరు ఘటనలలో అరెస్టు అయిన ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులను విచారించిన క్రమంలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. పుల్వామా ప్రాంతానికి చెందిన వారే కొందరు ఉగ్రవాదులకు తమ వంతుగా సహకారం అందించారు. సూసైడ్ బాంబర్ అయిన అదిల్ దార్ అంతిమక్షణాలను కూడా స్థానికులు తమ సెల్‌ఫోన్ల ద్వారా చిత్రీకరించినట్లు కూడా ఈ చార్జీషీట్‌లో వెల్లడైంది.

ఈ ఆత్మాహుతి దాడికి దిగిన అదిల్ ఈ చర్య కోసం 200 కిలోల పేలుడు పదార్థాలను వంటికి బిగించుకుని ఓ వాహనంతో వేగంగా వెళ్లి సిఆర్‌పిఎఫ్ కాన్వాయ్‌ను ఢీకొన్నాడు. ఉగ్రవాద సానుభూతిపరుల నుంచి, స్థానికుల నుంచి చాలా కాలంగా ఉగ్రవాదులకు సరైన ఆశ్రయం దక్కిందని, ఈ క్రమంలోనే ఈ అత్యంత భయానక ఉగ్రవాద దాడితో సిఆర్‌పిఎఫ్ బలగాలను మట్టుపెట్టారని వెల్లడైంది.

ఈ కేసును ఎన్‌ఐఎ సంయుక్త సంచాలకులు అనిల్ శుక్లా సారథ్యంలో దర్యాప్తు జరిపారు. పలు రకాలుగా హైటెక్ పరిజ్ఞానాన్ని వాడుకున్నారని, ఇ కామర్స్ వేదికలను ఉగ్రవాద చర్య కోసం వ్యూహకర్తలు వినియోగించుకున్నారని తెలిసింది. వారికి అవసరం అయిన శక్తివంతమైన బ్యాటరీలు, ఐ ఫోన్లు, కొన్ని రకాల రసాయనాలు వంటివి అక్కడి వారి నుంచే ఫోన్ల చెల్లింపుల ద్వారా సేకరించుకున్నట్లు వెల్లడైంది. 

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ ఏడుగురిని అరెస్టు చేశారని అధికారులు తెలిపారు. పాకిస్థాన్‌లో ఉండి కార్యకలాపాలు సాగిస్తున్న అజర్ కాకుండా ఈ కేసులో ఏడుగురు ఉగ్రవాదుల పేర్లు ఉన్నాయి. వీరిలో కొందరు వివిధ ఎన్‌కౌంటర్లల్లో హతులయ్యారు. నలుగురు తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలిసింది. వీరిలో ఇద్దరు జమ్మూ కశ్మీర్‌లోనే తలదాచుకుని ఉన్నట్లు కనుగొన్నారు. వీరిలో ఒకరు స్థానికుడు మరొకరు పాకిస్థానీయుడు.