ఒత్తిడితోనే ఢిల్లీ అల్లర్లపై పుస్తక ఉపసంహరణ

ఒత్తిడితోనే ఢిల్లీ అల్లర్లపై పుస్తక ఉపసంహరణ
ఢిల్లీ అలర్లకు సంబంధించి రాసిన పుస్తకాన్ని బ్లూస్‌బరీ భారత విభాగం ఉపసంహరించుకోవడంపై పుస్తక రచయితల్లో ఒకరు, న్యాయవాది మోనికా ఆరోరా తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. దీని వెనుక బ్లూస్‌బరీ బ్రిటన్‌ విభాగం ఒత్తిడి ఉందని ఆమె ఆరోపించారు. 
 
బ్లూస్‌బరీ యుకె నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగానే భారత విభాగం తమ పుస్తకాన్ని వెనక్కు తీసుకుందని ఆమె ధ్వజమెత్తారు. దీన్నిచూస్తే దీర్ఘకాలికంగా ఉన్న వలసవాదం, శ్వేతజాతీయులు ఇప్పటికీ మనల్ని పరిపాలిస్తున్నట్లు అనిపిస్తోందని ఆమె మండిపడ్డారు. 
 
అరోరాతో పాటు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు సోనాలి చితాల్కర్‌, ప్రేర్నా మల్హోత్రా ఈ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తక ఆవిష్కరణకు సంబంధించి శనివారం ఏర్పాటు చేసిన వర్చువల్‌ ప్రీలాంచ్‌ కార్యకమానికి అరగంట ముందు పుస్తకాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు బ్లూస్‌బరీ పేర్కొంది. 
 
అల్లర్లకు సంబంధించి మేధావులు, విద్యావేత్తల బృందం ఈ ఏడాది మార్చి 11న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డికి ఇచ్చిన నివేదిక అధారంగా ఈ పుస్తకాన్ని రచించినట్లు అరోరా తెలిపారు. అనంతరం పబ్లిషర్‌ దగ్గరకు వెళ్లి ప్రచురణకు కాంట్రాక్టు కుదుర్చుకున్నామని, ఫైనల్‌ డ్రాఫ్ట్‌ను కూడా బ్లూస్‌బరీ ఎడిటర్లు ఆమోదించారని ఆమె వివరించారు.