కేంద్రమంత్రి శ్రీపాద్‌ ఆరోగ్యం విషమం

కేంద్రమంత్రి శ్రీపాద్‌ ఆరోగ్యం విషమం
కేంద్ర ఆయుష్‌శాఖ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆయనలో ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోయాయని గోవా ముఖ్యమంత్రి  ప్రమోద్‌ సావంత్‌  చెప్పారు.
 
కరోనా మహమ్మారి బారిన పడిన శ్రీపాద్‌ నాయక్‌ ప్రస్తుతం గోవా రాజధాని పనాజీలో ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ అని రావడంతో శ్రీపాద్‌నాయక్‌ ఈ నెల 12 నుంచి పనాజీలోని ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
 
 హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ కట్టర్‌ కరోనా వైరస్‌ బారిన పడ్డారు. లక్షణాలు కనిపించడంతో ఆయన పరీక్ష చేయించకోగా కరోనా పాజిటివ్‌ అని రిపోర్ట్‌ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. గత కొద్ది రోజులగా తనను కలిసిన వారు, తనతో కాంటాక్ట్‌లో ఉన్నవారంతా పరీక్షలు చేయించకోవాలని, స్వీయ నిర్భందంలోకి వెళ్లాలని కట్టర్‌ కోరారు. 
 
అంతకు ముందే హర్యానా అసెంబ్లీ స్పీకర్‌ గియాన్‌ చందు గుప్తాతో సహా మరో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ అని వచ్చిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అనిల్‌ విజ్‌ తెలిపారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు స్పీకర్‌కు వైరస్‌ సోకిందని పేర్కొన్నారు. ఆరుగురు అసెంబ్లీ సిబ్బందికి కూడా కరోనా సోకింది. అయితే, స్పీకర్‌ గైర్హాజరులో డిప్యూటీ స్పీకర్‌ రణబీర్‌ గంగ్వా సభా కార్యకలాపాలను నిర్వహిస్తారు.
కాగా, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేదని, ఆయన కోమాలోనే ఉన్నారని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ దవాఖాన తెలిపింది. శ్వాసకోశ సంబంధ ఇన్‌ఫెక్షన్‌కు వైద్యులు చికిత్సనందిస్తున్నారని పేర్కొంది. వెంటిలేటర్‌ మద్దతుపై చికిత్సనందిస్తున్నట్లు వెల్లడించింది. 
 
ఇలా ఉండగా, దేశంలో ఒక్కరోజే 61,408 కరోనా కేసులు  నమోదుకావడంతో సోమవారం నాటికి దేశంలో కరోనా వైరస్ బారినపడిన వారి సంఖ్య 31 లక్షలు దాటింది. కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 23 లక్షలు దాటి రికవరీ శాతం 75.27 శాతానికి చేరుకుంది.
 
దేశంలో కొవిడ్-19 కాటుకు గురైన వారి సంఖ్య 31,06,348కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడచిన 24 గంటల్లో 836 మరణాలు చోటుచేసుకోవడంతో కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 57,542కి పెరిగింది. కరోనా మరణాల రేట్ 1.85 శాతానికి తగ్గగా రికవరీ రేటు 75.27 శాతానికి చేరుకుందని కేంద్రం తెలిపింది.