కాంగ్రెస్‌ను ఎవరూ కాపాడలేరు

కాంగ్రెస్‌ పార్టీని ఇప్పుడు ఎవరూ కాపాడలేరని  మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు. గతంలో పార్టీ వ్యవహారాలపై జ్యోతిరాదిత్య సింధియా గళమెత్తితే ఆయనను బీజేపీతో కుమ్మక్యయ్యారని ఆరోపించారని, ఇప్పుడు గులాం నబీ ఆజాద్‌, కపిల్‌ సిబాల్‌ వంటి సీనియర్‌ నేతలు పార్టీకి పూర్తికాల అధ్యక్షుడిని నియమించాలని డిమాండ్‌ చేస్తే వారినీ బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారని ధ్వజమెత్తారు.
గాంధీ-నెహ్రూ కుటుంబ ఉనికి సంక్షోభంలో పడిందని, వారి రాజకీయ ప్రాబల్యం ముగిసిపోయిందని బీజేపీ సీనియర్‌ నేత ఉమాభారతి  చెప్పారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగవుతుందని ఆమె స్పష్టం చేశారు.
 
 ‘గాంధీ–నెహ్రూ కుటుంబ ఉనికి ప్రమాదంలో ఉంది. వారి రాజకీయ ఆధిపత్యం ముగిసింది. కాంగ్రెస్ పని అయిపోయింది. ఇప్పుడు ఎవరు ఏ పొజిషన్‌లో ఉంటారనేదే ముఖ్యం. కాంగ్రెస్‌ గాంధీగా మారాలి. ఎలాంటి విదేశీ మూలకం లేని నిజమైన స్వదేశీ గాంధీగా మారాలి’ అని ఉమా భారతి పేర్కొన్నారు. పార్టీ పగ్గాలు ఇక ఎవరికి అప్పగిస్తారనేది చూడాలని అంటూ  కాంగ్రెస్‌ను తిరిగి విదేశీ శక్తుల చేతిలో కాకుండా స్వదేశీ గాంధీ కనుసన్నల్లో ఉండాలని హితవు చెప్పారు.
జాతీయ స్థాయిలో దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పతనానికి చేరువలో ఉందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహరావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పరిణామాలు చూస్తుంటే ఆ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా ఉందని, అందుకే కొంద‌రు కాంగ్రెస్ నేతలు పార్టీ వీడి బీజేపీలో చేరుతున్నారని విమర్శించారు.  కుటుంబ పార్టీల పరిస్థితి ఎప్పటికైనా మారుతుందని కాంగ్రెస్ పార్టీని చుస్తే అర్ధమవుతుందని పేర్కొన్నారు. వంశపారంపర్య పార్టీలకు ఇలాంటి ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు.