తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులపై సంకటం 

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ రాకపోకలు ఇప్పట్లో లేనట్లే కనిపిస్తోంది. అంతరాష్ట్ర సర్వీసులపై రెండు రాష్ట్రాల మధ్య దోబూచులాట వీడటం లేదు. చిక్కుముడులుగా ఉన్న సమస్యలకు పరిష్కారం కనబడుట లేదు.  
 
ఇంటర్ స్టేట్ బస్సు సర్వీసులు తిప్పే అంశంపై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. మరోసారి భేటీ కావాలని ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇరు రాష్ట్రాల సర్వీసులు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాయన్న అంశంపై ఒక నిర్ణయానికి రాలేక పోతున్నారు. టిఎస్‌ఆర్టీసి బస్సులు ఎపిలో లక్షా 50 వేల కిలోమీటర్లు, ఎపిఎస్ ఆర్టీసీ బస్సులు తెలంగాణలో 2 లక్షల 61 కిలోమీటర్లు తిరుగుతున్నాయి. 
 
ఎపిలో తిరిగే ఆర్టిసి బస్సుల కంటే తెలంగాణలో ఎపిఎస్‌ఆర్టీసి బస్సులు లక్షా 11 వేల కిలోమీటర్లు అదనంగా తిరగుతున్నాయి. కాబట్టి అదనపు కిలోమీటర్లు తగ్గించుకోవాలని ఎపి అధికారులకు, టిఎస్‌ఆర్టీసి అధికారులు కోరుతుండగా, ఏపీ అధికారుల నుండి స్పందన రావడం లేదు.
 
మార్చి నెలలో లాక్‌‌డౌన్ దగ్గర నుంచి నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించడానికి సోమవారం బస్‌ భవన్‌లో ఇరు రాష్ట్రాల ఆర్టీసీ  సమావేశం అయ్యారు.  రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య  అంతరాష్ట్ర సర్వీస్ లపై కొత్తగా ఒప్పందం చేసుకోవాలని ఏపీ అధికారుల ముందు తెలంగాణ అధికారులు ప్రతిపాదన పెట్టారు. 
 
రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత మరోసారి భేటీ అవుతామని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీంతో చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.