కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెబ్‌సైట్ హ్యాక్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్ హ్యాక్ అయ్యింది. కిషన్‌రెడ్డి.కామ్ వెబ్‌సైట్‌పై పాకిస్థాన్‌కు చెందిన హ్యాకర్లు దాడి చేశారు. భారత స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15న దీనిని హ్యాక్ చేశారు.

పాకిస్థాన్, కశ్మీర్ స్వేచ్ఛకు అనుకూలంగా పలు సందేశాలు ఉంచడంతోపాటు భారత ప్రభుత్వానికి పలు హెచ్చరికలు చేశారు. దీంతో నాటి నుంచి ఈ వెబ్‌సైట్ తెరుచుకోవడం లేదు.

హైదరాబాద్ లోని కిషన్ రెడ్డి కార్యాలయం ఈ విషయాన్ని మంగళవారం ధృవీకరించింది. ఈ నేపథ్యంలో వెబ్‌సైట్ ప్రజలకు అందుబాటులో లేదని తెలిపింది.

ఇందులో కిషన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం, రాజకీయ కార్యక్రమాలకు సంబంధించినవి తప్ప దేశానికి సంబంధించిన ఎలాంటి కీలక సమాచారం లేదని పేర్కొంది. వెబ్‌సైట్‌ను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కిషన్ రెడ్డి కార్యాలయం వెల్లడించింది.