సతీశ్‌రెడ్డి పదవీకాలం పొడగింపు

డీఆర్డీఓ చైర్మన్‌ జీ సతీశ్‌రెడ్డి పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్ల పాటు పొడగించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 26తో ఆయన పదవీకాలం పూర్తి కానుంది. 
 
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ చైర్మన్ గా కొనసాగుతున్న సతీశ్‌రెడ్డి రక్షణ మంత్రికి శాస్త్ర, సాంకేతిక సలహాదారుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామానికి చెందిన సతీశ్‌రెడ్డి హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రులయ్యారు.
 
డీఆర్డీఓలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ) డైరెక్టర్‌గానూ పని చేశారు. అంతరిక్ష పరిజ్ఞానంలో నిష్ణాతుడైన ఆయన క్షిపణి వ్యవస్థలపై పరిశోధన, అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పదవీకాలం పూర్తి అవుతుండగా, పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ మరో రెండేళ్లు కొనసాగించేందుకు నిర్ణయించింది.