కరోనా కారణంగా స్కూళ్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆన్ లైన్ తరగతులు నిర్వహించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులను నిర్వహించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ (విద్యా) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామ్‌చంద్రన్ సోమవారం విడుదల చేశారు. డిజిటల్, టీవీ, టీశాట్ వంటి నెట్‌వర్క్ ఛానల్ ప్లాట్‌ఫాంల ద్వారా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించబడతాయి.
ఈ-లెర్నింగ్, దూర విద్యలో భాగంగా అన్ని పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఉపాధ్యాయులందరూ ఆగస్టు 27 నుంచి క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరు కావాలి.
అవసరమైన ఈ-కంటెంట్ పాఠ్య ప్రణాళికకు సిద్ధం కావాలి. పాఠశాలలు తిరిగి తెరవడం, సాధారణ తరగతుల ప్రారంభానికి సంబంధించి భారత ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించనున్నట్లు తెలిసింది. తదుపరి ప్రభుత్వ నిర్ణయం వరకు అన్ని పాఠశాలలు విద్యార్థుల కోసం మూసివేయబడే ఉంటాయని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
More Stories
ప్రజాపాలన దినోత్సవం కాదు… ప్రజావంచన దినోత్సవం
ట్యాంక్‌బండ్ వద్ద ఫ్లెక్సీలు, బారికేడ్లను తొలిగిన గణేశ్ ఉత్సవ సమితి
ముడి పామాయిల్ దిగుమతిపై పన్ను పెంపు