ఏపీ అవసరాలు తీర్చాకే గోదావరి జలాల తరలింపు 

ఆంధ్రప్రదేశ్‌ అవసరాలు తీర్చిన తరువాతే గోదావరి జలాలను కావేరి (గ్రాండ్‌ ఆనకట్ట) నదికి మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం గోదావరిలో మిగులు జలాలపై సంపూర్ణ హక్కు దిగువ రాష్ట్రమైన ఏపీదేనని గుర్తు చేసింది. 
 
గోదావరిలో 75 శాతం నీటిలభ్యత ఆధారంగా చూస్తే మిగులు జలాలే ఉండవని, అలాంటప్పుడు ఏ నీటిని కావేరికి మళ్లిస్తారని ప్రశ్నించింది. తాము ప్రస్తావించిన అంశాలకు వివరణ ఇస్తే అధ్యయనం చేసి గోదావరి – కావేరి అనుసంధానంపై అభిప్రాయం చెబుతామని పేర్కొంది. 
 
కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ అధ్యక్షతన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలక మండలి సమావేశాన్ని సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు (అంతరాష్ట్ర నదీ జలాలు) ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 
 
గోదావరి నుంచి మొత్తం 247 టీఎంసీలను మళ్లించాలని ఎన్‌డబ్ల్యూడీఏ మూడు రకాల ప్రతిపాదనలు చేసింది. ఇచ్చంపల్లి, అకినేపల్లిల నుంచి ఎత్తిపోసే గోదావరి జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 81, తెలంగాణకు 66, తమిళనాడుకు 83 టీఎంసీలు ఇవ్వాలని పేర్కొంది. 
 
జానంపేట నుంచి ఎత్తిపోసే గోదావరి జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 108, తెలంగాణకు 39, తమిళనాడుకు 83 టీఎంసీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ఏపీ అవసరాలు తీర్చాకనే ఇతర ప్రాంతాలకు గోదావరి జలాలను మళ్లించాలని కేంద్రానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
దీనిపై ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదని తాజా సమావేశంలో సలహాదారు వెంకటేశ్వరావుప్రస్తావించారు.  గోదావరి జిలాల్లో తెలంగాణకు 954.23 టీఎంసీల వాటా ఉందని, వాటిని మినహాయించుకుని మిగులు జలాలను ఇతర ప్రాంతాలకు తరలించాలని ఆ రాష్ట్ర ఈఎన్‌సీ మురళీధర్‌ పేర్కొనడంపై కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
గోదావరి, కృష్ణా ట్రిబ్యునల్‌ అవార్డులపై తనకు సమగ్ర అవగాహన ఉందని, ఆ స్థాయిలో తెలంగాణకు కేటాయింపులు లేవని స్పష్టం చేశారు. ఒడిశా, చత్తీస్‌గఢ్, మహారాష్ట్రలు వినియోగించుకోని జలాలే గోదావరిలో మిగులు జలాలుగా ఉన్నాయని గుర్తు చేశారు.

గోదావరి- కావేరీ అనుసంధానంపై ఏపీ ప్రభుత్వం కోరిన వివరణలను పంపుతామని, ఇతర రాష్ట్రాలు చేసిన ప్రతిపాదనలను కూడా పంపుతామని, వీటిపై అభిప్రాయం చెప్పాలని  ఎన్‌డబ్ల్యూడీఏ ఛైర్మన్‌
 భూపాల్‌ సింగ్‌ సూచించారు.