స్వర్ణ ప్యాలెస్‌ కేసులో జిల్లా అధికారులూ నిందితులా!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన స్వర్ణ ప్యాలెస్ ప్రమాదం కేసులో డాక్టర్ రమేష్‌తో పాటు ఆస్పత్రిపై కూడా చర్యలు తీసుకోకుండా హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. 
 
అరెస్ట్‌పై స్టే కోరుతూ డాక్టర్ రమేష్ వేసిన క్వాష్ పిటిషన్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారిస్తూ హోటల్‌లో కోవిడ్ నిర్వహణకు అధికారులు అనుమిచ్చారన్న విషయాన్ని కూడా కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావనకు తెచ్చింది.
 
స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో కోవిడ్‌ సెంటర్‌ నిర్వహణకు అధికారులు అనుమతిచ్చారని, అలాంటప్పుడు అనుమతులిచ్చిన అధికారులనూ ఈ కేసులో నిందితులుగా చేరుస్తారా? అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అనుమతులు మంజూరు చేసిన కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, డిఎంహెచ్‌ఒ కూడా ప్రమాదానికి బాధ్యులే కదా అని హైకోర్టు అభిప్రాయపడింది. 
 
”ఏళ్ల తరబడి హోటల్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. హోటల్‌లో కోవిడ్‌ నిర్వహణకు అధికారులు అనుమతిచ్చారు. అనుమతి మంజూరు చేసిన కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, డిఎంహెచ్‌ఓ కూడా ప్రమాదానికి బాధ్యులే కదా. కేసులో అధికారులనూ నిందితులుగా చేరుస్తారా?” అని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది.
 
 డాక్టర్ రమేష్‌ను అరెస్ట్ చేయకుండా ఉంటారా..? తామే ఉత్వర్వులు ఇవ్వాలా..? అని ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని కోర్టుకు తెలిపారు.