
చైనా విస్తరణవాదం పట్ల వియత్నాం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. దక్షిణ చైనా సముద్రం వివాదాస్పద దీవుల్లో చైనా బాంబర్‌ను మోహరించడంతో వియత్నాం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో భద్రత క్షీణించిందని ఆవేదన చెందుతోంది.
భారత దేశంలో వియత్నాం రాయబారి ఫామ్ సన్హ్ చౌ భారత దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్ శృంగ్లాకు చైనా దుశ్చర్యలను వివరించారు. చైనా బాంబర్‌ను ఈ దీవుల్లో మోహరించడంతో దక్షిణ చైనా సముద్రంలో భద్రత క్షీణిస్తోందని చెప్పారు. ఈ ప్రాంతంలో తాజా పరిస్థితులను చర్చించారు. భారత దేశంతో బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యానికి వియత్నాం కృత నిశ్చయంతో ఉందని తెలిపారు.
చైనీస్ స్టేట్ మీడియా కథనాల ప్రకారం, దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో అమెరికా సైనిక కార్యకలాపాలను అణచివేసేందుకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)కు అవకాశం ఇస్తూ, వివాదాస్పద పారాసెల్ దీవుల్లో అతి పెద్ద దీవి అయిన వుడీ ఐలండ్‌లో గత నెలలో హెచ్-6జే బాంబర్‌ను చైనా మోహరించింది.
చైనా చేపట్టిన చర్యలు ఈ ప్రాంతంలో పరిస్థితిని ప్రమాదంలోకి నెట్టాయని వియత్నాం ఆరోపించింది. అంతేకాకుండా తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తోందని చైనాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
స్నేహ హస్తాన్ని అందించిన భారత దేశంపై కూడా చైనా దురాక్రమణ బుద్దితోనే వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మే నుంచి తూర్పు లడఖ్‌లో భారీగా బలగాలను మోహరించి, భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది.
జూన్ 15న భారత సైన్యంపై దాడి చేసి, 20 మంది జవాన్లను పొట్టనబెట్టుకుంది. ఆ తర్వాత అనేకసార్లు చర్చలు జరుపుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల నుంచి తమ దళాలను ఉపసంహరించుకోకుండా దొంగాట ఆడుతున్నది.
More Stories
క్రిమియాను రష్యాకు వదులుకునేందుకు ఉక్రెయిన్ విముఖం
విద్యార్థుల వీసాల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్
పోప్ అంత్యక్రియలకు ముర్ము, ట్రంప్ సహా 2 లక్షల మంది హాజరు