దావూద్ ఇబ్రహీంపై మాటమార్చిన పాక్ 

దావూద్ ఇబ్రహీంపై మాటమార్చిన పాక్ 

ప్రపంచంలోనే కరడుగట్టిన ఉగ్రవాదిగా, ఆర్ధిక నేరస్తుడిగా పేరొందిన దావూద్ ఇబ్రహీం ఉనికి గురించి పాకిస్థాన్ ప్రపంచాన్ని తికమక పెట్టె ప్రయత్నం చేస్తున్నది. తమదేశంలోనే ఉన్నట్లు ముందు ఒక నివేదికను విడుదల చేసిన పాకిస్థాన్, 24 గంటల్లోనే మాట మార్చి భారత్ మీడియా తమపై దుష్ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించింది.

దావుద్‌ కరాచీలో ఉన్నట్లు అంగీకరించి, అతన్ని ఉగ్రవాదిల జాబితాలో చేర్చిన పాక్, వెంటనే యూటర్న్‌ తీసుకొని,ఇబ్రహీం కరాచీలో లేడని, అతనికి తమ దేశంలో ప్రవేశం లేదని ప్రకటించింది. భారత్ ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్న దావూద్ ఇబ్రహీం   1993 ముంబై వరుస పేలుళ్లలో కీలక నిందితుడు. అతనిని అప్పజెప్పమని భారత్ కోరుతూ వస్తున్నది.

ప్యారిస్‌కు చెందిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్)  జూన్ 2018లో విధించిన గ్రే లిస్ట్ నుంచి తప్పించుకునేందుకు  తాజాగా పాకిస్తాన్‌ 88 నిషేధిత ఉగ్రవాద సంస్థలు, దాని అధినేతలపై కఠిన ఆంక్షలు విధించింది. ఇందులో దావుద్ ఇబ్రహీంను పేరుకూడా ఉంది.

దావుద్ ఇబ్రహీంతో పాటు జమాతుద్ దావా చీఫ్ హఫీజ్ సయీద్, జైషే మహ్మద్ చీఫ్ ముసూద్ అజహర్, జకీర్ రెహమాన్ లఖ్వీ తదితరుల పేర్లను కూడా ఆ జాబితాలో చేర్చింది. వీరి స్థిర, చరస్తులను సీజ్ చేసి, వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తున్నట్లు తెలియజేస్తూ రెండు నోటిఫికేషన్ల విడుదల చేసింది.

గ్రే లిస్ట్‌లో దావుద్‌ను చేర్చడంతో మాఫియా డాన్ తమ దేశంలోనే ఉన్నట్లు పాక్ అంగీకరించినట్లయ్యింది. అయితే జాబితా ‌ ప్రకటించిన కొన్ని గంటలకే దాయాది దేశం మాట మార్చింది. దావూద్‌ తమ దేశంలో ఉన్నారని అంగీకరించినట్లు భారత్‌ మీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తుందని ఆరోపించింది. దావుద్‌కు తమదేశంలో చోటు లేదని పేర్కొంది.

ఎఫ్‌ఏటీఎఫ్​ ఆర్థిక ఆంక్షలు విధిస్తుందేమోనన్న భయం, ప్రపంచ దేశాల ఒత్తిళ్ల కారణంగా తమ దేశంలో ఉగ్రవాదుల ఉనికి గురించి వాస్తవాలను కప్పిపుచ్చేందుకు పాకిస్థాన్ విఫల ప్రయత్నాలు చేస్తున్నది. 

ఆగస్టు 18న జారీ అయిన ఒక నోటిఫికేషన్ గురించి స్థానిక విలేకరులతో పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి జాహిద్ చౌధరి మాట్లాడుతూ.. పాకిస్తాన్ 2020 ఆస్టు 18న జారీ చేసిన ఎస్ఆర్ఓ (చట్టబద్ధమైన నోటిఫికేషన్) చాలా పక్కా సమాచారంతో ఉందని, ఇంతకు ముందు జారీ చేసిన ఎస్ఆర్ఓను కూడా ఒక ప్రక్రియ ప్రకారమే ఇచ్చామని తెలిపారు.  

ఈ ఎస్ఆర్ఓను చూపిస్తూ తమ దేశంలో కొందరు ఉన్నట్లు (దావూద్‌) పాకిస్తాన్‌ అంగీకరించిందని భారత మీడియాలోని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అవి నిరాధారం, కల్పితమని జాహిద్ చౌధరి చెప్పుకొచ్చారు.