ఆరోగ్య సేతులో ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితి 

మహమ్మారి కరోనా సోకకుండా జాగ్రత్త పడేందుకు సాయం చేసే కోవిడ్‌ ట్రేసింగ్‌ యాప్‌ `ఆరోగ్య సేతు’లో కేంద్ర ప్రభుత్వం కొత్త ఫీచర్‌ ప్రవేశపెట్టింది. కోవిడ్‌-19 విజృంభణ నేపథ్యంలో వ్యాపార సంస్థల కార్యకలాపాలు సులభతరం చేసేలా ‘‘ఓపెన్‌ ఏపీఐ సర్వీస్‌’’ను తీసుకువచ్చింది.
 
దీని ద్వారా వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులు, ఈ యాప్‌ను ఉపయోగించే ఇతర యూజర్ల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే వీలు కల్పించింది. అయితే ఇందుకు సదరు యూజర్ల అంగీకారం తప్పనిసరి అని, దీని ద్వారా ఆరోగ్య సేతు యాప్‌ యూజర్ల డేటా, గోప్యతకు ఎలాంటి భంగం కలగబోదని స్పష్టం చేసింది.  
 
అదే విధంగా ఇందులో కేవలం ఆరోగ్య సేతు స్టేటస్‌, యూజర్‌ పేరు తప్ప మరే ఇతర వివరాలు ఉండవని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ , ఐటీ మంత్రిత్వ శాఖ  వెల్లడించింది. కాగా ప్రాణాంతక కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ యాప్‌ ద్వారా ఇప్పటి వరకు 30 వేల పాజిటివ్‌ కేసులను ట్రేస్‌ చేశారు.
 
దీంతో కరోనా బాధితులను గుర్తించడంతో పాటు వారిని అప్రమత్తం చేసి తగిన చికిత్స అందించడం ఆరోగ్య కార్యకర్తలకు తేలికైంది. ఇక ఆరోగ్య సేతు యాప్‌నకు సుమారు 15 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.