23.5 కోట్లసోషల్‌ మీడియా యూజర్ల డేటా లీక్‌

23.5 కోట్ల ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌, యూట్యూబ్‌ వినియోగదార్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఆన్‌లైన్‌లో లీక్‌ అయింది. హాంకాంగ్‌కు చెందిన ‘సోషల్‌ డేటా’ అనే సంస్థ వివిధ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలకు చెందిన వారి వ్యక్తిగత వివరాలను అమ్ముకుని సొమ్ముచేసుకుంటోందని కంపారిటెక్‌ పరిశోధకులు వెల్లడించారు. 
 
ఈ మేరకు కొద్దిరోజుల క్రితం వారు ఓ నివేదికను విడుదల చేశారు. లీకైన సమాచారంలో ఆయా వినియోగదార్లకు సంబంధించిన పేర్లు, కాంటాక్ట్‌ వివరాలు, వ్యక్తిగత సమాచారం, ఫొటోలు ఉన్నాయని తెలిపింది.  ‘సోషల్‌ డేటా’ సమాచారాన్ని దొంగిలించడానికి వెబ్‌ స్క్రాపింగ్‌ పద్ధతిని ఉపయోగిస్తోందని పేర్కొంది. 
 
ఈ వెబ్‌ స్క్రాపింగ్‌ ఆటోమేటెడ్‌ స్క్రిప్ట్‌ ద్వారా వెబ్‌సైట్లు, వెబ్‌ పేజీలలోని సమాచారాన్ని తస్కరిస్తుందని తెలిపింది. లీకైన సమాచారంలో 192,392,954 మంది ఇన్‌స్టాగ్రామ్‌, 42,129,799 మంది టిక్‌టాక్, 3,955,892 మంది యూట్యూబ్‌ వినియోగదార్ల వివరాలు ఉన్నాయని కంపారిటెక్‌ వెల్లడించింది.