చైనాకు ధీటుగా టైవాన్ భారీ సైనిక ప్రదర్శన 

తైవాన్ తనదని చెప్పుకుంటున్న చైనాను ఆ దేశం లెక్కచేయడం లేదు. ఓవైపు తైవాన్‌కు సమీపంలో చైనా ఆర్మీ సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నా ఏమాత్రం బెదరడం లేదు. పైగా తైవాన్ కూడా భారీగా సైనిక ప్రదర్శన చేపట్టింది. 

తైవాన్ జలసంధికి సమీపంలోని కిన్‌మెన్‌లో చైనాతో ఘర్షణ జరిగి 62 ఏండ్లు అయిన సందర్భంగా ఆదివారం ఆ దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. 1958 ఆగస్టు నుంచి సుమారు నెలరోజులపాటు చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన తైవాన్ సైనికులకు ఆ దేశ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ కిన్‌మెన్ స్మారక పార్కు వద్ద ఘనంగా నివాళి అర్పించారు. 

అమెరికా రాయబారి బ్రెంట్ క్రిస్టెన్‌సెన్ కూడా తైవాన్ అధ్యక్షురాలితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తైవాన్‌కు తాము అండగా ఉంటామన్న భరోసా ఇచ్చారు. నాటి చైనా ఘర్షణను అమెరికా సరఫరా చేసిన ఆయుధాలతో తైవాన్ ఎదుర్కొంది. 

చైనాలోని మెట్రోపాలిటన్ నగరమైన జియామెన్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న కిన్‌మెన్ ద్వీపంతోపాటు తైవాన్ నియంత్రణలోని మాట్సు ద్వీప సమూహాన్ని స్వాధీనం చేసుకునేందుకు చైనా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో నాటి నుంచి ఈ వివాదంపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది.

మరోవైపు చైనాతో ఘర్షణ జరిగి 62 ఏండ్లైన సందర్భంగా సైనిక  ప్రదర్శనపై తైవాన్ రక్షణ మంత్రి ఒక వీడియోను విడుదల చేశారు. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్, యాంటీ షిప్ క్షిపణుల ప్రయోగం, ఆక్రమితను తిప్పికొట్టే మాక్ సైనిక విన్యాసాలు వంటివి ఈ వీడియోలో ఉన్నట్లు దక్షిణ చైనా మార్నింగ్ పోస్టు పేర్కొంది. 

తైవాన్ సైనిక శక్తిసామర్థ్యాలను తక్కువగా అంచనా వేయవద్దని ఆ దేశ రక్షణ మంత్రి చైనాకు పరోక్షంగా ఇందులో హెచ్చరించారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పదేపదే రెచ్చగొట్టినా ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన పేర్కొన్నారు.

కాగా, దక్షిణ చైనా సముద్రంలో చైనా  చర్యలను పూర్తిగా గమనిస్తున్నామని, తైవాన్ సైనిక సామర్థ్యంపై ప్రజలకు నమ్మకం ఉన్నదని ఆ దేశ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ ఇటీవల స్పష్టం చేశారు.