జాతీయ పక్షితో ప్రధాని మోదీ విహారం 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొవిడ్ పరిస్థితుల్లో ఇంట్లో ఎలా గడుపుతున్నదానిపై ఓ వీడియో విడుదల చేశారు. ఈ సారి జాతీయ పక్షి నెమలితో కాలక్షేపం చేస్తూ కనిపించారు. 1.47నిమిషాల నిడివికలిగిన వీడియోలో నెమలితో వివిధ సందర్భాల్లో గడిపిన తీరు అందులో కనిపిస్తోంది.
 
అరచేతిలో ధాన్యం పట్టుకుని స్వయంగా నెమళ్లకు తినిపిస్తున్న దృశ్యాలు, విధుల్లో భాగంగా బయటకు వెళుతున్నప్పుడు, మార్నింగ్, ఈవినింగ్ వాక్ చేస్తుండగా నెమలి ప్రధానమంత్రికి అతి సమీపంలో తచ్చాడుతూ పురివిప్పుతున్న సుందర దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.
 
ఇంట్లో ఉన్న సమయంలో అందరు ఎలాగైతే ఉంటారో ప్రధాని మోడీ కూడా సాధారణ దుస్తుల్లో కనిపించడమే కాకుండా ప్రకృతి ప్రేమికుడిని తలపించారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా ఆకట్టుకుంటోంది.  
 
తన అధికారిక నివాసంలో నిత్యం మోదీ మార్నింగ్‌ వాక్‌ చేస్తుంటారు. ప్రధాని నడక, ఇతర వ్యాయామాలు చేస్తుంటే పరిసరాల్లో నెమళ్లు తచ్చాడుతుంటాయట. వీటి స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా చూసుకుంటారాయన. 
 
ప్రకృతి ప్రేమికుడైన మోదీ తన నివాసంలో పక్షులు గూళ్లు పెట్టుకునేందుకు వీలుగా ఎత్తైన స్తంభాలతో కూడిన ఆకృతులను కూడా ఏర్పాటు చేశారు. ఆదివారం వాకింగ్‌ చేస్తున్నపుడు తన దగ్గరకు వచ్చిన నెమళ్లకు మోదీ కింద కూర్చొని మరీ ఇలా ఆహారం అందించారు.