ఢిల్లీ అల్లర్లపై గ్రంధం ఉపసంహరణపై దుమారం

గత ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన అల్లర్లలో జిహాదీ – నక్సల్స్ దుష్ప్రచారాన్ని ఎండగడుతూ ముగ్గురు రచయిత్రులు వ్రాసిన గ్రంధాన్ని ఆవిష్కరణకు అరగంటకు ముందు ఉపసంహరించుకొంటున్నట్లు ప్రచురణకర్త బ్లూమ్సబూరీ ఇండియా శనివారం ప్రకటించడం పెను దుమారం రేపుతున్నది.
“ఢిల్లీ అల్లర్లు 2020: చెప్పని కధనం” పేరుతో మోనికా అరోరా, సోనాలి చిటల్కర్, ప్రేమ మల్హోత్రా వ్రాసిన ఈ గ్రంధాన్ని ఎటువంటి కారణం తెలుపకుండానే నక్సల్స్, జిహాదీ వర్గాల నుండి వచ్చిన వత్తిడిల మేరకు ప్రచురణను ఉపసంహరించు కొంటున్నట్లు ప్రకటించారు.
అయితే ఇప్పటి వరకు ఈ విషయాన్నీ అధికారికంగా కనీసం రచయిత్రలకు మెయిల్ ద్వారా కూడా తెలపలేదు.
ఈ గ్రంథావిష్కరణలో సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, ఓపిడియా సంపాదకుడు నుపుర్ శర్మ, బిజెపి నేత కపిల్ మిశ్రా పాల్గొనవలసి ఉంది.  కేవలం తమ అనుమతి లేకుండా ఆవిష్కరణ జరుగుతున్నట్లు మాత్రమే పేర్కొన్నారు.
అంతకు ముందు సోషల్ మీడియాలో కపిల్ మిశ్రా వంటివారు పాల్గొనడం పట్ల ఆవిష్కరణ కార్మక్రమాన్ని విమర్శిస్తూ వామపక్ష, జిహాదీ వర్గాలు పెద్ద ఎత్తున నిరసన పోస్టింగ్ లు ప్రచారం చేశాయి. క్షేత్రస్థాయిలో అసలు ఏమి జరిగిందో అంటూ లోతయిన అధ్యయనం జరిపి ఈ గ్రంధాన్ని తయారు చేశారు.
అయితే ప్రచురణకర్తలు గాని, నిరసన తెలిపిన వారు గాని ఆ గ్రంధంలో వాస్తవాలను వక్రీకరించారని అంటూ ఒక్క ఉదాహరణను కూడా చూపలేదు. పైగా, ఢిల్లీలో ఫిబ్రవరి, 2020లో జరిగిన అల్లర్లకు సంబంధించి వాస్తవాలను ముందుంచుతున్నామని అంటూ ప్రచురణకర్తలు అంతకు ముందు ప్రకటించారు.
ప్రచురణకర్తలు నిర్ణయం పట్ల ప్రిన్సిపాల్ ఆర్ధిక సలహాదారుడు సంజీవ్ సన్యాల్ నిరసన వ్యక్తం చేస్తూ ఇది ప్రచురణలో నాణ్యత నియంత్రణ కాకుండా సైద్ధాంతిక సెన్సార్ షిప్ అంటూ విమర్శించారు. ఇంకెప్పుడు తాను ఆ ప్రచురణ సంస్థకు తన గ్రంధాలు ఇవ్వబోనని స్పష్టం చేశారు. వాస్తవమైన ఇంటర్వ్యూలు, దర్యాప్తుల ఆధారంగా రచయిత్రలు సేకరించిన వాస్తవాలతో గ్రంధం ప్రచురిస్తున్నట్లు వెల్లడించారు.   
వచ్చే నెలలో మార్కెట్ లోకి రావలసిన ఈ గ్రంధం కోసం ఈ-కామర్స్ వేదిక అమెజాన్ లో ఇటీవల మరే గ్రంధానికి రానంతగా అత్యధిక ఆర్డర్లు వచ్చాయి. అయితే గ్రంథ ప్రచురణను ఉపసంహరించు కొంటున్నట్లు ప్రకటించడానికి ముందే గ్రంధాలు అందుబాటులో లేవని అంటూ ఆ వేదికలో రావడం గమనార్హం.
ఈ గ్రంధం ప్రచురణ పట్ల నిరసన తెలిపిన వారిలో వివాదాస్పద నటి స్వర భాస్కర్, కాంగ్రెస్ మద్దతుదారుడు సాకేత్ గోఖలే, వామపక్ష రచయిత మీనా కందస్వామి, హిందూ వ్యతిరేక జర్నలిస్టు హ్రతోష్ సింగ్ బబాల్, భారత వ్యతిరేక రచయిత రానా అయ్యుబ్ వంటివారున్నారు. ఇస్లామిస్ట్ లతో సంబంధాలు ఉన్న దక్షిణ ఆసియా సాలిడారిటీ ఇనిషియేటివ్ కూడా ఈ నిరసనలలో పాల్గొన్నది.
బ్లూమ్సబూరీ ఇండియా చర్య పట్ల పలువురు ప్రముఖ రచయితలు నిరసన వ్యక్తం చేస్తూ ఇక తమ గ్రంధాలను ఆ ప్రచురణ సంస్థకు ఇవ్వబోమని ప్రకటించారు. ఆ ప్రచురణ సంస్థ నుండి తన గ్రంధాలు అన్నింటిని ఉపసంహరించు కొంటున్నట్లు ప్రముఖ రచయిత సందీప్  దెవొ ప్రకటించారు.
బ్లూమ్సబూరీ ఇండియా సెన్సార్ షిప్ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, రచయిత సంజయ్ దీక్షిత్ స్పష్టం చేశారు. ఈ సంస్థతో తన సంబంధాన్ని తెంచివేసుకొంటున్నట్లు వెల్లడి చేశారు. ఆయన వ్రాసిన “ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేయడం, సీఎఎ చట్టం” గ్రంధం సెప్టెంబర్ 20న ఆ ప్రచురణ సంస్థ నుండి విడుదల కావలసి ఉంది.