అధ్యక్ష పదవికి కాంగ్రెస్ లో ఆరాటం 

అధ్యక్ష పదవికి కాంగ్రెస్ లో ఆరాటం 
కాంగ్రెస్ పార్టీ పనిచేసే అధ్యక్షుడి కోసం ఎదురు చూస్తున్నది. అయిష్టతతో ఆ పదవి చేయపట్టిన రాహుల్ గాంధీ ఒక ఎన్నికల్లో పరాజయం ఎదురు కాగానే వైరాగ్య ధోరణులు ప్రకటించడం, అనారోగ్యంతో ఇల్లు దాటి బైటకు రాలేని సోనియా గాంధీని గత సంవత్సరకాలంగా ఇన్ ఛార్జ్ అధ్యక్షురాలిగా కొనసాగిస్తూ ఉండడంతో పార్టీలో కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకొనేవారు కనబడటం లేదు. 
 
ఇటువంటి సమయంలో పార్టీ కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక మండలి అయిన సీడబ్ల్యూసీ భేటీ సోమవారం జరుగుతున్నది. పార్టీలో  నాయకత్వ మార్పు అవసరం అంటూ పార్టీ సీనియర్ నేతలు అనేకమంది లేఖలు వ్రాసిన అనంతరం ఈ సమావేశం జరుగుతున్నది. 
 
పార్టీ నుండి బహిష్కరణకు గురైన సంజయ్ ఝా సుమారు 100 మంది నాయకులు ఈ లేఖ వ్రాసారని ఈ మధ్య వెల్లడించగా, ఈ విషయమై పార్టీ నాయకత్వం పెదవి విప్పడం లేదు. అంతకు ముందు పార్టీ రాజ్యసభ సభ్యులతో సోనియా గాంధీ జరిపిన వీడియో సమావేశంలో సహితం నాయకత్వ అంశం ప్రస్తావనకు రావడం గమనార్హం. 
 
నాయకత్వాన్ని మార్చడంతో పాటు పార్టీని పూర్తి ప్రక్షాళన చేయాలని కూడా ఆ బృందం డిమాండ్ చేసింది. పార్టీకి పూర్తి కాలపు అధ్యక్షునితో పాటు దూర దృష్టి, క్రియాశీలకంగా ఉండే అధ్యక్షుడు ఉండాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
 
పార్టీలో కీలకమైన గులాబీ నబి ఆజాద్, ఆనంద్ శర్మ, కపిల్ సిబాల్, శశి ధరూర్, మిలిందర్ దేవరా, జితిన్ ప్రసాద,  పృథ్విరాజ్ చవాన్, భూపేందర్ సింగ్ హుడా పలువురు ప్రముఖులు సుమారు  వ్రాసిన ఈ లేఖ పక్షం రోజుల తర్వాత బైటపడింది. పార్టీ ప్రస్తుత‌ నాయ‌క‌త్వాన్ని మార్చ‌డంతోపాటు పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలనే వారి డిమాండ్ ప్రాధాన్యత సంతరింప చేసుకొంది.
 
 పార్టీకి పూర్తి కాలపు అధ్యక్షునితో పాటు దూర దృష్టి, క్రియాశీలకంగా ఉండే అధ్యక్షుడు ఉండాలని వారు స్పష్టం చేశారు. పార్టీలో అనిశ్చితి ఏర్ప‌డింద‌ని, యువ‌త విశ్వాసం కోల్పోతున్న‌ద‌ని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
అందువ‌ల్ల పార్టీకి పునరుజ్జీవం పోయడానికి, మార్గదర్శనం చేయడానికి సంస్థాగత యంత్రాంగాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేయాల‌ని అధ్యక్షురాలికి సూచించారు. ముఖ్యంగా పార్టీలో భజనపరులకు అందలం ఎక్కించే సంస్కృతికి స్వస్తి పలికి, అన్ని స్థాయిలలో ఎన్నికల ద్వారా నీయమకాలు జరగాలని స్పష్టం చేశారు.