లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయినవారికి సగం జీతం

క‌రోనా సమయంలో లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులకు మూడు నెలల పాటు వారి సగటు వేతనంలో 50 శాతాన్ని చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గాంగ్వార్‌ నేతృత్వంలోని ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ఈఎస్ఐసీ ) బోర్డు . ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 

ఈఎస్ఐసీలో ఇప్పటికే సభ్యులైన కార్మికులు తాజా ఆర్థిక సాయానికి అర్హులు అవుతారని కేంద్రం స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా 41 లక్షల మంది కార్మికులకు ఈ సాయం లబ్ధి చేకూర్చనుంది. ఈ ఏడాది మార్చి 24 నుంచి డిసెంబర్ 31 వరకు కరోనా విపత్తు కారణంగా ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయారో వారికి ఈ నిరుద్యోగ భృతిని ప్ర‌భుత్వం చెల్లించనుంది 

రూ.21,000 లోపు వేతనంతో పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఈఎస్ఐసీలో లబ్ధి పొందుతారు. ప్రతినెలా వారి మూలవేతనంలో 0.75 శాతాన్ని ఈ పథకంలో జమచేయనున్నారు. యాజమాన్యాలు కూడా 3.25 శాతం జమచేస్తాయి. వైద్య అవసరాలు, ఔషధాల కోసం ఈ సొమ్మును ఉపయోగించుకోవచ్చు. 

లబ్ధిదారులు తమ యాజమాన్యాల ద్వారా కాకుండా.. నేరుగా ఈఎస్ఐసీ బ్రాంచిల్లో క్లెయిమ్‌ చేసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.