ఖరీఫ్‌ పంటల మద్దతు ధరలకు రూ.2.6 లక్షల కోట్లు

ఖరీఫ్‌ పంటల మద్దతు ధరలకు రూ.2.6 లక్షల కోట్లు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం పంటల కనీస మద్దతు ధర పెంపు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.  రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా, ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను ప్రభుత్వం సవరించింది.  పంట పెట్టుబడి ఖర్చుకు అదనంగా 50 శాతం కలిపి కొత్త ధరలను నిర్ణయించారు. సాధారణ వరి రకానికి కనీస మద్దతు ధరను రూ.2,441 గా ఖరారు చేశారు.
నాణ్యమైన గ్రేడ్-ఏ రకం వరికి మద్దతు ధరను రూ.2,461 గా నిర్ణయించారు. రాబోయే ఖరీఫ్ పంటల మద్దతు కోసం ప్రభుత్వం ఏకంగా రూ.2.6 లక్షల కోట్లను కేటాయించింది. “ఏడాదికి 824.41 లక్షల మిలిటన్‌ టన్నుల పంట సేకరణ చేస్తున్నాం. పంట ఖర్చుకు అదనంగా 50 శాతం కనీస మద్దతు ధరగా నిర్ణయం చేశాం. 2014-26 మధ్య ఖరీఫ్‌ పంటలకు రూ.19 లక్షల కోట్ల కనీస మద్దతు ధర చెల్లించాం. 2014-26 మధ్య 8,746 లక్షల మిలిటన్‌ టన్నుల ఖరీఫ్‌ పంట సేకరించాం. యూపీఏ హయాం కంటే నాలుగు రెట్లు అధికంగా రైతులకు ఖరీఫ్‌ చెల్లింపులు చేస్తున్నాం” అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

క్వింటాల్‌ పొద్దుతిరుగుడు మద్దతు ధరను రూ.622 పెంచి రూ.8,343 గా నిర్ణయించారు. అదేవిధంగా క్వింటాల్‌ పత్తిపై రూ.557 పెంచి రూ.8,267 మద్దతు ధరగా ప్రకటించారు. క్వింటాల్‌ నువ్వుల మద్దతు ధరను రూ.500 పెంచి రూ.10,052 గా నిర్ణయించింది.  అదేవిధంగా క్వింటాల్‌ సజ్జల మద్ధతు ధర రూ.2,900గా, క్వింటాల్‌ రాగుల మద్దతు ధర రూ.5,205గా, క్వింటాల్‌ మక్కజొన్న మద్దతు ధర రూ.2,410 గా, క్వింటాల్‌ కందుల మద్దతు ధర రూ.8,450 గా, క్వింటాల్‌ పెసర్ల మద్దతు ధర రూ.8,780గా, క్వింటాల్‌ మినుముల మద్దతు ధర రూ.7,800 గా, క్వింటాల్‌ పల్లీల మద్దతు ధర రూ.7,263గా కేంద్రం ప్రకటించింది.

కాగా, దేశంలో బొగ్గు వినియోగాన్ని ఆధునికీకరిం చేందుకు కోల్లి , లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు రూ.37,500 కోట్ల కేటాయింపునకు కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుతో దిగుమతి ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించడంతో పాటు దేశీయ పరిశ్రమలకు మద్దతు లభించనుంది.​  

గుజరాత్‌లోని అహ్మ‌దాబాద్ జిల్లాలోని సర్కేజీ – ధోలేరా మధ్య సెమీ హైస్పీడ్ డబుల్ రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. 134 కిలో మీట‌ర్ల మేర విస్త‌రించి ఉన్న ఈ ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యం రూ.20,667 కోట్లగా పేర్కొంది. 2030-31 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కానుంది. అలాగే నాగ్‌పుర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నతీకరణకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.