ఇస్రోలో ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు 

 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రైవేటీకరణపై అనేక అపోహాలు ఉన్నాయని చైర్మన్ కే శివన్ తెలిపారు. అంతరిక్ష రంగంలో ప్రస్తుతం చేపడుతున్న సంస్కరణలు ప్రైవేటీకరణ లక్ష్యంగా జరుగడం లేదని ఆయన స్పష్టం చేశారు.
 
 “అంతరిక్ష రంగంలో భారతదేశ సామర్థ్యాన్ని వెలికితీయడం” అనే అంశంపై జరిగిన వెబ్‌నార్‌లో శివన్ మాట్లాసుతు ఇస్రోలో ప్రైవేటీకరణ అన్న ప్రసక్తే లేదని చెప్పారు. ఈ విషయాన్ని తాను పదే పదే చెబుతున్నానని గుర్తు చేశారు. వాస్తవానికి, ప్రైవేటు వ్యక్తులు అంతరిక్ష కార్యకలాపాలను నిర్వహించడానికి మొత్తం యంత్రాంగం వీలు కల్పిస్తున్నదని శివన్ తెలిపారు. 
 
అదే లేకపోతే అవన్నీ ఇస్రోనే చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సంస్కరణల వల్ల ఇస్రో కార్యకలాపాలు మరింతగా పెరుగుతాయని చెబుతూ దీంతో అన్ని వనరులను ఇస్రో వినియోగించుకుని మరింతగా పురోగతి సాధిస్తుందని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంతరిక్ష రంగ సంస్కరణలు భారతదేశ అంతరిక్ష రంగంలో సమూల మార్పులు తీసుకువస్తాయని శివన్  భరోసా వ్యక్తం చేశారు. 
 
అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నదని, ఇది ఆరోగ్యవంతమైన పోటీ అని  ఆయన స్పష్టం చేశారు. అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనలు సహా సంబంధించిన అన్ని రంగాల్లో ప్రైవేటు సంస్థలు పాల్గొనడానికి కేంద్రమంత్రివర్గం జూన్ 24న ఆమోదం తెలిపింది. 
 
కొత్తగా ఏర్పాటు చేసిన ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) భారతీయ అంతరిక్ష మౌలిక సదుపాయాలను ప్రైవేట్ కంపెనీలుఉపయోగించుకునేందుకు, అంతరిక్ష కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలు కల్పిస్తుందని కేంద్రం పేర్కొంది. దీంతో ఇస్రోను ప్రైవేటీకరణ చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే అవన్నీ కేవలం అపోహాలేనంటూ శివన్ కొట్టివేశారు.