శ్మశానాల కబ్జాలను కూడా పట్టించుకోని వక్ఫ్‌‌బోర్డు  

శ్మశానాల కబ్జాలను కూడా పట్టించుకోని వక్ఫ్‌‌బోర్డు  
కేసీఆర్ ప్రభుత్వం భరోసాతో భూకబ్జాలను అడ్డుఅదుపు లేకుండా సాగనిస్తున్న వక్ఫ్ బోర్డు కనీసం శ్మశానాల కబ్జాలను సహితం పట్టించుకోవడం లేదు. ఈ విషయమై స్వయంగా హైకోర్టు మొట్టికాయలు వేయడం గమనార్హం. 
 

శ్మశానాల కబ్జాలను వక్ఫ్‌‌బోర్డు సాధారణ అంశంగా చూస్తోందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడంలో వక్ఫ్‌‌బోర్డు చైర్మన్ ‌‌అసమర్ధ‌త చాటుకుంటున్నారని మండిపడింది. 63 శ్మశానాలు ఆక్రమణలకు గురైనట్లుగా వక్ఫ్‌‌బోర్డు కౌంటర్ ‌‌పిటిషన్ ‌‌వేసిందేగానీ, ఎవరు కబ్జా చేశారు, వాటి సర్వే నంబర్ల వివరాలతో సమగ్ర నివేదిక ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. 

రెవెన్యూ శాఖకు మాత్రమే ఫిర్యాదు చేసి, పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీసింది. ఆక్రమణదారులపై క్రిమినల్‌ కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. పోలీసులకు ఫిర్యాదు చేయలేదంటే ఆక్రమణ దారులతో వక్ఫ్ ‌బోర్డు కుమ్మక్కయినట్టుగా భావించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. 

సంబంధిత పోలీస్‌‌స్టేషన్లలో వక్ఫ్ ‌‌బోర్డు ఫిర్యాదు చేయడానికి ఏ శక్తులు అడ్డుకుంటున్నాయని అంటూ ప్రభుత్వ పెద్దల బండారాన్ని ప్రశ్నించింది. వక్ఫ్ శాఖకు ఒక మంత్రి, ఒక సలహాదారుడు కూడా ఉన్నప్పకిటీకి ఏమీ పట్టించుకో పోవడంతో ఈ ఆక్రమణలు అన్ని ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే జరుగుతున్నట్లు స్పష్టం అవుతున్నది. 

హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని శ్మశానాలను కబ్జాదారుల నుంచి కాపాడాలని హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ ‌ఇలియాస్ ‌‌హైకోర్టులో పిల్ వేశారు. రాష్ట్రంలో ముస్లింల శ్మశానాలను కాపాడడానికి, నిర్వహించడానికి నీయమ్మ,నిబంధనలే లేవని పిటిషన్ లో పేర్కొన్నారు. 

దీనిపై చీఫ్‌‌జస్టిస్‌‌ రాఘవేంద్రసింగ్ ‌‌చౌహాన్, జస్టిస్‌‌ బొల్లం విజయసేన్ రెడ్డిల డివిజన్‌‌బెంచ్‌‌ విచారిస్తూ  వక్ఫ్‌‌బోర్డు తీరు చూస్తే మైనార్టీల అభ్యున్నతికి పాటుపడుతున్నట్టుగా లేదని వ్యాఖ్యలు చేసింది. శ్మశానాలన్నీ కబ్జా అవుతుంటే చివరికి ముస్లింలు మరణిస్తే ఎక్కడ ఖననం చేస్తారని వక్ఫ్‌ బోర్డును బెంచ్ ప్రశ్నించింది. 

ఆక్రమణలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలతోపాటు ఫిర్యాదులు రెవెన్యూ శాఖకే ఎందుకు పరిమితం చేశారో, పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. శ్మశానాలను కాపాడడానికి కూడా  చట్టరీత్యా చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసింది.