నీళ్ల విషయంలో అన్యాయం జరిగితే మళ్లీ ఉద్యమం  

నీళ్ల విషయంలో అన్యాయం జరిగితే మళ్లీ ఉద్యమం చేస్తామని  మాజీ ఎంపీ, బిజెపి నేత జితేందర్ రెడ్డి   హెచ్చరించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రజలు కోరుకున్నట్లు లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.
“కేసీఆర్ నాయకత్వంలో పాలమూరు జిల్లాకు నీళ్లు వస్తాయి అనుకున్నాం. పాలమూరు నీళ్ల కోసం 2014లో లక్ష మందితో ఫౌండేషన్ వేశాం. సీఎం కేసీఆర్ కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధపాలమూరుపై పెట్టలేదు. సీఎంతో సహా అందరూ.. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చడానికి పూనుకున్నారు” .
ఇలాగే జరిగితే హైదరాబాద్ కు వస్తున్న 17.7 టీఎంసీ నీళ్లు కూడా రాకుండా అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాజెక్ట్ విషయంలో టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారిచేసినా కూడా ఏపీ పట్టించుకోకుండా టెండర్ల ప్రక్రియ కొనసాగిస్తోందని మండిపడ్డారు. మహబూబ్ నగర్- ఖమ్మం ప్రజలకు అన్యాయం జరిగితే మళ్ళీ ఇదే ప్రాంతం నుంచి ఉద్యమాన్ని చేపడుతామని స్పష్టం చేశారు.
కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్ల విషయంలో అన్యాయం జరిగితే మళ్ళీ ఉద్యమాన్ని చేస్తామని  జితేంద్రారెడ్డి ప్రకటించారు. కేసీఆర్ ఆరేళ్ళ పాలన చూస్తుంటే తెలంగాణలో ఉన్నామా? మళ్ళీ పాత ఏపీలో ఉన్నామా అనే అనుమానమోస్తుందని ధ్వజమెత్తారు.
సీఎం కేసీఆర్ అపెక్స్ కమిటీలో నీటి విషయంలో స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ రైతాంగానికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని కోరారు. ఏపీ అక్రమంగా తీసుకుపోతున్న నీళ్లను తెలంగాణ సర్కార్ అడ్డుకోవాలని స్పష్టం చేశారు. కేసీఆర్ సర్కార్ 220 టీఎంసీ నీళ్లను ఉపయోగించుకోకుండా వృధా చేస్తుందని మండిపడ్డారు.