టెలిగ్రాం యాప్‌లో ఇక వీడియో కాల్స్ కూడా!

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రాం (https://telegram.org)లో ఇప్పటికే వాట్సాప్‌కు దీటుగా అనేక ఫీచ‌ర్లు అందుబాటులో ఉన్నాయి. వాట్సప్‌తో పోల్చితే ఆకర్షణీయమైన, యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్ లేకపోవడంతో వెనకబడుతోంది. వాట్సాప్‌లో ఉన్న వీడియోకాల్ ఫీచ‌ర్ ఇప్పటికీ టెలిగ్రాంలో లేదు.
 
అయితే, ఎట్టకేలకు టెలిగ్రాం వీడియోకాల్ ఫీచ‌ర్‌ను త‌న వినియోగదార్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక‌పై టెలిగ్రాం వినియోగదార్లు కూడా వీడియో కాల్స్ చేసుకోవ‌చ్చు. కొత్తగా అప్‌డేట్ చేయ‌బ‌డిన టెలిగ్రాం వెర్షన్ 7.0.0లో ఈ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. కాంటాక్ట్స్ ప్రొఫైల్‌లోకి వెళ్లి కావ‌ల్సిన కాంటాక్ట్‌ను ఎంచుకుని వీడియో కాల్స్ చేయ‌వచ్చు. 
 
అంతేకాదు వీడియో, వాయిస్ కాల్స్ మ‌ధ్య సుల‌భంగా మార‌వ‌చ్చు. పిక్చర్ ఇన్ పిక్చర్ త‌ర‌హాలో వీడియో కాల్స్ చేసుకునేందుకు సదుపాయాన్ని అందించారు. ఇక చాట్స్ లాగే వీడియోకాల్స్ కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల వినియోగదార్లకు రక్షణ ఉంటుంది.

ఇక కొత్త అప్‌డేట్‌లో వీడియోకాల్స్‌తోపాటు యానిమేటెడ్ ఎమోజీల‌ను కూడా టెలిగ్రాం అందిస్తోంది. అయితే ప్రస్తుతం వీడియోకాల్స్ ఫీచ‌ర్ టెస్టింగ్ ద‌శ‌లోనే ఉన్నా అంద‌రికీ అందుబాటులో ఉంది. త్వర‌లో ఈ ఫీచ‌ర్‌కు మ‌రిన్ని మార్పులు, చేర్పులు చేస్తారు. 

 
ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంల‌పై వినియోగదార్లు వీడియో కాలింగ్ ఫీచ‌ర్‌ను ప్రస్తుతం వాడుకోవ‌చ్చు. ఇక గ్రూప్ వీడియో కాల్స్ కు కూడా త్వర‌లోనే స‌పోర్ట్‌ను అందివ్వనున్నారు. ఇప్పటి వ‌ర‌కు ఈ యాప్‌లో ఫైల్ సైజ్ 1.5జీబీ వ‌ర‌కు మాత్రమే పంపుకునేందుకు వీలుండేది. ఇప్పుడు దానిని 2జీబీ వరకు పంపుకునే వెసులుబాటును కల్పించారు. 
 
అదేవిధంగా ‘పీపుల్ నియ‌ర్‌బై’ అనే మ‌రో ఫీచ‌ర్‌ను కూడా టెలిగ్రాంలో కొత్తగా అందిస్తున్నారు. దీని స‌హాయంతో వినియోగదార్లు త‌మ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారు త‌మ‌కు ఎంత దూరంలో ఉన్నారో తెలుసుకునే సౌలభ్యం వుంది.  అదేవిధంగా మన ఫోన్ కాంటాక్ట్‌ లిస్ట్ లో లేని వారి నుంచి మెసేజ్‌లు వ‌స్తుంటే వారిని ఆటోమేటిగ్గా బ్లాక్ చేసేలా నూత‌నంగా ప్రైవ‌సీ, సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను కూడా అందిస్తున్నారు. 
 
అలాంటి వారి మెసేజ్‌ల‌ను ఆర్కైవ్‌లోకి పంపుకోవ‌చ్చు. లేదా చాట్స్‌ను మ్యూట్ చేయ‌వ‌చ్చు. ఇక 500 అంత‌క‌న్నా ఎక్కువ మెంబ‌ర్లు ఉండే గ్రూపుల అడ్మిన్లు గ్రూప్‌కు సంబంధించి డిటెయిల్డ్ గ్రాఫ్ రూపంలో యాక్టివిటీల‌ను తెలుసుకోవ‌చ్చు. అలాగే టాప్ మెంబ‌ర్ల వివ‌రాలు, వారు ఎన్ని మెసేజ్‌ల‌ను పంపారు, స‌రాస‌రి ఒక్కో మెసేజ్ ఎంత నిడివి ఉందనే వివ‌రాల‌ను కూడా తెలుసుకోవ‌చ్చు. స‌రిగ్గా ఇవే ఫీచర్లను త్వర‌లో 100 మంది మెంబ‌ర్లు ఉన్న గ్రూపుల‌కు కూడా అందివ్వనున్నారు.